నిన్న రష్మిక, కత్రినా.. ఇప్పుడు కాజోల్.. అసలేం జరుగుతోంది?
డీప్ ఫేక్ వీడియోలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 9:15 PM ISTనిన్న రష్మిక, కత్రినా.. ఇప్పుడు కాజోల్.. అసలేం జరుగుతోంది?
డీప్ ఫేక్ వీడియోలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న హీరోయిన్ రష్మిక మందన్న వీడియో అంటూ నెట్టింట ఒక వీడియో హల్‌చల్ చేసింది. అయితే.. నిజానికి ఆ వీడియో రష్మికది కాదు. కొందరు వ్యక్తులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వీడియో డీప్ ఫేక్ చేసి రష్మిక ఫేస్‌ను పెట్టారు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా దీన్ని ఖండించారు. రష్మిక కూడా ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదంతా మరువక ముందే కట్రీనా కైఫ్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్ అయింది.
తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఎఐ టెక్నాలజీకి టార్గెట్ అయింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆకతాయిలు కాజోల్ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ఇంగ్లిష్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ రోజీ బ్రీన్ ఈ ఏడాది జూన్ లో 'గెట్ రెడీ విత్ మి’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి 'కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పట్ల ఆమె అభిమానులతో పాటు సామాన్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ మానవులకు ఉపయోగపడేలా ఉండాలి కానీ.. ఇలా ఇబ్బందులను తెచ్చిపెట్టేలా ఉండొద్దని అంటున్నారు. కొందరైతే ఇప్పుడు స్టార్లకు ఎదురవుతున్న పరిస్థితే .. రేపు సామాన్యులకు ఎదురవ్వొచ్చనీ.. అప్పుడు పరిస్థితులు మరోలా ఉండే అవకాశం ఉందనంటున్నారు.
ఇక పోలీసులు సైతం డీప్ ఫేక్ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోల సమస్య రోజురోజుకు పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరైనా డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఫిర్యాదు చేస్తే.. 36 గంటల్లోగా వీడియోను డెలిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.