చంద్రముఖి-2 ట్రైలర్ వచ్చేసింది..'ఇది అదేరా'
చంద్రముఖి-2 సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2023 1:15 PMచంద్రముఖి-2 ట్రైలర్ వచ్చేసింది..'ఇది అదేరా'
చంద్రముఖి సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. కానీ.. హార్రర్ సినిమాల్లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది ఈ మూవీ. టీవీల్లో వస్తే ఇప్పటికీ కొందరు ఈ సినిమాను వదలకుండా చూస్తారు. అలాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా చంద్రముఖి-2 వస్తోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి.వాసు చంద్రముఖి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్‌లో రజనీకాంత్ హీరోగా కనిపించారు. ఇక చంద్రముఖి-2లో రాఘవ లారెన్స్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ కనిపించనున్నారు.
పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం వడివేలు భయపడుతూ తనదైన శైలిలో కామెడీ పంచాడు. ఇది అదే.. చంద్రముఖి మళ్లీ వచ్చేసింది, 17 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ అవుతుందా..? అంటూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. వెట్టయరాజాకు చంద్రముఖికి మధ్యలో పగ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ చక్కగా సూటయ్యారు. ఈ ట్రైలర్‌లో ఆమె కానిపించేది కాసేపే. ఇక ఫ్లాష్‍బ్యాక్‍లో రాఘవా లారెన్స్ వెట్టయరాజగా కనిపిస్తారు. చాలా సంత్సరాలుగా చంద్రముఖికి, వెట్టయరాజాకు పగ ఉన్నట్టు ట్రైలర్లో ఉంది. చంద్రముఖి-2 ట్రైలర్ చివర్లో ఓ యుద్ధం సీక్వెన్స్ కూడా ఉంది.
చంద్రముఖి-2 ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గానే ఉన్నా.. మొత్తంగా చూస్తే చంద్రముఖిలానే ఈ చిత్రం ఉంటుందనిపిస్తోంది. కథ, కథనం కూడా అలాగే సాగేలా అనిపిస్తోంది. చంద్రముఖి సినిమా 2005లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చంద్రముఖి 2లో హీరోగా రాఘవ లారెన్స్ చేశారు.