'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలకృష్ణ వైరల్ కామెంట్స్

'భగవంత్‌ కేసరి' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  9 Oct 2023 10:38 AM IST
Bhagavanth kesari movie, balakrishna, viral comments,

'గ్రౌండ్ ఫ్లోర్‌ బలిసిందా అన్నాడు'.. బాలకృష్ణ వైరల్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'భగవంత్‌ కేసరి'. ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని అనిల్‌ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకను హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ హాజరయ్యారు. ఈ వేడుకలో ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోగా.. బాలకృష్ణ కామెంట్స్‌ మాత్రం అందరితో నవ్వులు పూయించాయి. అంతేకాదు.. బాలయ్య తన కుమారుడి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య 'భగవంత్‌ కేసరి' ట్రైలర్ లాంచ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీలీల తనకు కుమార్తెగా నటించిందని చెప్పారు. తర్వాతి సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని.. హీరో హీరోయిన్లుగా చేద్దామని చెప్పానని అన్నారు. ఇదే విషయం తన ఇంట్లో చెప్పానని... వారు కాస్త భిన్నంగా స్పందించారని బాలయ్య అన్నారు. తన కుమారుడు మోక్షజ్ఞ అయితే తాను హీరోగా రాబోతుంటే శ్రీలీలకు ఆఫర్‌ ఇస్తావా? గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా అంటూ తిట్టాడని బాలయ్య కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఈవెంట్‌ పాల్గొన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. కొందరు మాత్రం సినిమాల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమైందని మాట్లాడుకుంటున్నారు. తాజాగా బాలయ్య కామెంట్స్‌తో అది తేలిపోయిందని చెబుతున్నారు.

2017లోనే బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాడని చెప్పారు. కానీ.. తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ లేదనే వార్తలు వినిపించాయి. కానీ.. హీరో అయ్యేందకు మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కామెంట్స్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాగా.. భగవంత్‌ కేసరి సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story