బేబీకి క్రేజీ ఆఫర్‌.. సీక్వెల్ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్

తాజాగా వైష్ణవి చైతన్య స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసిందని తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 6:20 PM IST
Baby Movie, Vaishnavi Chaitanya, Got offer, Puri Movie,

బేబీకి క్రేజీ ఆఫర్‌.. సీక్వెల్ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్

యూట్యూబ్‌లో నటిస్తూ క్రమంగా పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. షార్ట్‌ ఫిలింస్, వెబ్‌సిరీస్‌లు చేస్తూ సినిమాల్లోనూ కొన్ని పాత్రలు చేసింది. అయితే.. అవి చిన్న క్యారెక్టర్స్‌ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. బేబీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన తర్వాత మాత్రం.. ఆమె పేరు మార్మోగుతోంది. ఆమె నటనకు డైరెక్టర్స్‌, నిర్మాతలు ఫిదా అవుతున్నారు. బేబీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతూనే ఉంది. రికార్డులను తిరగరాస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ బేబీ మూవీ.. కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాను రూ.15 కోట్లతో నిర్మిస్తే.. ఇప్పటి వరకు రూ.75 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక లాంగ్‌ రన్‌లో బేబీ రూ.100 కోట్లు సాధించడం పక్కా అంటున్నారు సినిమా విశ్లేషకులు.

బేబీ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవీ చైతన్య. హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమాలోనే ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించింది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. వైష్ణవి నటనను చూసిన అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యకు వరుసగా హీరోయిన్‌ ఆఫర్లు వస్తున్టన్లు తెలుస్తోంది. ఇప్పటికే వైష్ణవికి అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌లో ఒక సినిమా ఆఫర్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆఫర్‌ కూడా బేబీకి దక్కిందని టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా వైష్ణవి చైతన్య ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసిందని తెలుస్తోంది. అది కూడా ఒక సూపర్‌ హిట్‌ సినిమా సీక్వెల్‌లో ఒక హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. హీరో రామ్‌, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా హిట్‌గా నిలిచింది. అయితే.. దీనికి సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. బేబీ మూవీ సూపర్బ్‌గా నటించిన వైష్ణవి చైతన్యకు రామ్‌ పక్కన హీరోయిన్‌గా చేసే చాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బేబీలో వైష్ణవి నటనను మెచ్చిన పూరీ జగన్నాథ్‌ తాను తీస్తోన్న సీక్వెల్‌లో హీరోయిన్‌గా పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ మధ్య కాలంలో హీరో రామ్ కూడా వైష్ణవికి పుష్పగుచ్ఛాన్ని పంపించారు. బేబీ సినిమా సక్సెస్‌ సాధించినందుకు అభినందనలు తెలిపాడు.


Next Story