'అర్జున్‌రెడ్డి' మూవీ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసిన 'బేబీ'

అర్జున్‌రెడ్డి మూవీ లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లను కూడా దాటేసింది 'బేబీ' సినిమా.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 5:54 PM IST
Baby Movie,  Arjun Reddy,  record break,

'అర్జున్‌రెడ్డి' మూవీ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసిన 'బేబీ'

చిన్న సినిమాగా తెరకెక్కి ప్రస్తుతం రికార్డులను తిరగరాస్తోంది 'బేబీ' సినిమా. తెలుగు ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్‌ బోర్డులే కనిపిస్తున్నాయంటే నమ్మండి. దీంతో.. ఎక్కడ విన్నా కూడా 'బేబీ' సినిమా కలెక్షన్ల గురించే చర్చ నడుస్తోంది. మూవీ విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్లలో ఊపు మాత్రం తగ్గడం లేదు. వర్షాల ఎఫెక్ట్‌ కూడా 'బేబీ' మూవీపై పడలేదు. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన విజయ్‌ దేవరకొండ సినిమా 'అర్జున్‌రెడ్డి' ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్‌ రేంజ్‌ కూడా మారిపోయింది. ఆయన్న అర్జున్‌రెడ్డి అనే పిలిచే స్థాయికి తీసుకెళ్లింది. అయితే.. ఇంత రికార్డ్స్‌ ఉన్న అర్జున్‌రెడ్డి మూవీ లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లను కూడా దాటేసింది 'బేబీ' సినిమా. అర్జున్‌రెడ్డి సినిమా లాంగ్‌ రన్‌లో రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. ఆ రికార్డును కేవలం 11 రోజుల్లోనే కలెక్ట్‌ చేసి 'బేబీ' చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక బేబీ మూవీ 12 రోజులకు గాను మొత్తంగా 73 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అపపుడే అయిపోలేదు.. ఇంకా ముందుంది అన్నట్లుగా దూసుకుపోతూనే ఉంది ఈ మూవీ.

'బేబీ' సినిమాను కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇంత తక్కువ బడ్జెట్‌ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు సినిమా విశ్లేషకులు. స్టార్‌ హీరోలు కూడా కొందరు ఈ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నారని అంటున్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో చిన్న సినిమాగా 'బేబీ' తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఈ తరం యువతకు ఎంతగానో నచ్చింది. విడుదలైన రోజు నుంచీ మీమ్స్‌.. కామెంట్స్‌తో ఏదో రకంగా ట్రెండింగ్‌లోనే ఉంటోంది 'బేబీ' సినిమా.

ఇక జూలై 28న పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్‌ తేజ్‌ నటించిన 'బ్రో' సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బేబీకి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్‌ మూవీ ఊహించని విధంగా కలెక్షన్లు సాధిస్తుండటంతో నిర్మాతలు సహా మూవీ టీమ్‌ ఎంతో సంతోషిస్తోంది.

Next Story