లండన్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం..!

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం.

By Srikanth Gundamalla  Published on  19 Sept 2023 2:28 PM IST
Allu Arjun, wax statue, london, madame tussauds ,

లండన్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం..!

టాలీవుడ్‌ హీరో, ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం లభించిన విషయం తెలిసిందే. పుష్ప పార్ట్‌-1 సినిమాలో నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నారు. అయితే.. మరోసారి అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన న్యూస్‌ను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ కూడా లండన్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఈ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలుస్తారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్, మహేశ్‌ బాబు మైనపు విగ్రహాలు ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-ది రూల్‌' సినిమాలో నటిస్తున్నారు. ఇది షూటింగ్‌ ప్రక్రియలో ఉంది. పుష్ప మొదటి పార్ట్‌కు ఎంతో ఆదరణ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు అభిమానులు ఏర్పడ్డారు. మేనరిజంతో అల్లు అర్జున్‌ అందరిని ఆకట్టుకున్నారు. దాంతో.. సెకండ్‌ పార్ట్‌ను కూడా మొదటి భాగానికి మించి తీయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే భారీ సెట్స్‌ వేస్తూ.. హై లెవల్‌లో పుష్ప పార్ట్‌-2ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల జాబితాలో టాప్‌ వన్‌లో నిలిచింది పుష్ప-2. దీని తర్వాత మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ 'టైగర్-3', ఐదో స్థానంలో షారుక్ సినిమా 'డుంకీ' నిలిచాయి.

Next Story