ఒకరు చేసిన పనిని ఇండస్ట్రీకి ఆపాదించొద్దు: అల్లు అరవింద్
రెండ్రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి గోవా వేదికగా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 2:29 PM ISTఒకరు చేసిన పనిని ఇండస్ట్రీకి ఆపాదించొద్దు: అల్లు అరవింద్
రెండ్రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి గోవా వేదికగా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరు అయ్యారు. నిర్వహణ లోపం వల్ల కొందరికి అసౌకర్యం ఏర్పడింది. దాంతో.. ఈ వేడుకలో తమని అవమాన పరిచారంటూ కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్ఆపట్లు చేయలేదని.. కన్నడ నటీనటులను అవమానించారంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమను మొత్తాన్ని తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. చర్చలు కొనసాగాయి.
తాజాగా ఇదే అంశంపై తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన పనిని మొత్తం చిత్ర పరిశ్రమకు ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు. గోవాలో జరిగిన అవార్డుల వేడుకలో ఇతర భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి ఇబ్బందులు జరిగాయని తెలిసిందన్నారు. అయితే..దానికి తెలుగు చిత్ర పరిశ్రమను మొత్తం వారు తప్పుబడుతున్నారనీ..దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లోనూ కనిపించాయని అల్లు అరవింద్ చెప్పారు. ఆ వార్తలను చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. అయితే.. గోవాలో జరిగిన అవార్డుల కార్యక్రమం పూర్తిగా ఒక వ్యక్తిని సంబంధించినది అని తెలిపారు. ఒక వ్యక్తిచ చేసిన పనిని వేరే వాళ్లకూ.. అలాగే ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదన్నారు. అలాగే అతడు మా కుటుంబంలో ఒకరికి పీఆర్‌వో అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది ఏమాత్రం నిజం కాదన్నారు. అది అతని పర్సనల్ ఫెయిల్యూర్ మాత్రమే అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
అయితే..గోవాలో అవార్డుల కార్యక్రమం నిర్వహణపై స్వయంగా ఆ నిర్వాహకుడు కూడా స్పందించారు. అసౌకర్యానికి గురైన ప్రతి ఒక్కరికి తన క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. సమాచార లోపంతోనే ఇబ్బందులు తలెత్తాయని.. ఇతర పరిశ్రమవారిని ఇబ్బంది పెట్టడం.. తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు.
అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే ..…
— Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023