చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' రచయిత

దేశ ప్రజలకు ఆదిపురుష్ సినిమా రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా క్షమాపణలు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 2:15 PM IST
Adipurush, Movie, Writer, Manoj,

 చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' రచయిత

భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా 'ఆదిపురుష్'. ప్రేక్షకులను అలరించడం మాట అటుంచితే.. తీవ్ర విమర్శలకు గురైంది. సినిమాలోని డైలాగ్స్‌, కొన్ని పాత్రల వేషధారణపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళనలు చేశారు. కొందరైతే డైరెక్టర్‌, రచయితను చంపుతామంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అయితే..తాజాగా దేశ ప్రజలకు ఆదిపురుష్ సినిమా రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా క్షమాపణలు చెప్పారు. 'ఆదిపురుష్' ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతిన్నాయనీ అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తమ వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు మనోజ్ శుక్లా. హనుమంతుడు మనల్ని అందరినీ ఐక్యంగా ఉంచాలని.. దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని కోరుతున్నా అంటూ మనోజ్‌ ట్వీట్‌ చేశారు. 'ఆదిపురుష్' సినిమాపై తీవ్ర విమర్శలు, వివాదాలు వచ్చిన తరుణంలో మనోజ్‌ ఇలాంటి ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది.

అయితే.. అంతకు ముందు 'ఆదిపురుష్' డైలాగ్‌ రైటర్ మనోజ్‌ తన డైలాగ్స్‌ సమర్ధించుకున్నారు. తాము రామాయణం తీయలేదని.. రామాయణాన్ని ఆదర్శంగా 'ఆదిపురుష్' సినిమా తీశామని చెప్పారు. అంతేకాదు.. విమర్శలు చేయడం తగదని కూడా చెప్పారు. కానీ.. తాజాగా ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పడం వైరల్‌ అవుతోంది.

'ఆదిపురుష్' చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా నటించారు. భారీ అంచనాల మద్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. రావణాసురుడు, ఇంద్రజిత్తు లుక్స్‌, మూవీలోని కొన్ని సంభాషనలు, ఇంకొన్ని సన్నివేశాలను పలువురు తప్పుబట్టారు.

Next Story