రాజకీయాల్లోకి అభిషేక్‌ బచ్చన్? 2024లో అక్కడి నుంచే పోటీ చేస్తారా?

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 4:31 PM IST
Abhishek Bachchan, Political Entry, 2024 Elections,

 రాజకీయాల్లోకి అభిషేక్‌ బచ్చన్? 2024లో అక్కడి నుంచే పోటీ చేస్తారా?

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ కూడా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎంపీ అభ్యర్థిగా ఆయన తండ్రి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసి ఘన విజయం సాధించిన లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణించి.. ప్రేక్షకులను అలరించిన అభిషేక్‌ బచ్చన్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్తతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సినిమాల్లో లాగే రాజకీయాల్లోనూ తన శైలి చూపించి అందరి మెప్పు పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రధాని రాజీవ్‌ గాంధీ కోరికమేరకు 1984లో అమితాబ్‌ బచ్చన్‌ కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రయాగ్‌రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో లోక్‌ దళ్‌ నాయకులు హేమ్‌వతి బహుగుణపై భారీ మెజార్టీతో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే.. ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్ తనయుడు అభిషేక్‌ కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అభిషేక్‌ తల్లి జయా బచ్చన్‌ ఎస్‌పీ తరఫున యూపీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా అభిషేక్‌ కూడా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవనున్నారని తెలుస్తోంది. ఆయన పోటీ చేస్తే గెలుపు ఖాయమని కూడా పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అభిషేక్‌ బచ్చన్‌ త్వరలోనే అఖిలేష్‌ యాదవ్ సమక్షంలో సమాజ్‌ వాదీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్‌ స్థానం నుంచి అభిషేక్‌ను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.కాగా.. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరూ అధికారంగా స్పందించలేదు. అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈసారి మాత్రం అభిషేక్‌ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు కాస్త ఎక్కువగానే వినపడుతున్నాయి. మరి అభిషేక్‌ ఏం చెప్తారనేది వేచి చూడాల్సిందే.

రీసెంట్ గా అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ జంటగా నటించిన దాస్వి చిత్రం ఓటీటీ రిలీజైంది. ఇందులో అభిషేక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చేతిలో ధూమ్ 4, హౌస్‌ఫుల్ 5, దాస్విన్ చిత్రాలు ఉన్నాయి.

Next Story