హైదరాబాద్‌: లాక్‌డౌన్‌కు ముందు రూ. లక్ష జీతం.. ఇప్పుడు కూలీ పని

By సుభాష్  Published on  21 May 2020 1:18 PM IST
హైదరాబాద్‌: లాక్‌డౌన్‌కు ముందు రూ. లక్ష జీతం.. ఇప్పుడు కూలీ పని

దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. కోట్లాది మంది జీవితాలను నాశనం చేస్తోంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి లేక ఎందరో రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఉద్యోగాలు సైతం కోల్పోవడంతో ఎంత చదువులు చదివినా చివరికి కూలీ పనులు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కరోనా ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమైపోతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి కూలీలుగా అవతారమెత్తుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన చిరంజీవి, పద్మదంపతుల జీవనం అగమ్యగోచరంగా మారింది.

ఉన్నత చదువులు చదివినా లాభం లేకుండా పోతోంది. పీజీ, బీఈడీ చేసిన చిరంజీవి, ఎంబీఏ చేసిన పద్మలు ఉపాధ్యాయులుగా పని చేస్తూ మంచి జీవితం గడుపుతుండగా, కరోనా వచ్చి జీవితంలో నిప్పులు పోసినట్లయింది. లాక్‌డౌన్‌కు ముందు మంచి వేతనం తీసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. ఇక కరోనా ఎఫెక్ట్‌తో పాఠశాలలు మూతపడగా, వేతనాలు లేక ఇబ్బందులపాలవుతున్నారు. ఇప్పుడు ఇద్దరూ కూడా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్యక్రమం కింద, ఉపాధిహామీ పథకంలో రోజు వారి కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్నతమైన జీవితం గడిపిన వారికి ఒక్కసారిగా వారి జీవితాలను తలకిందులుగా చేసింది. ఉన్న ఉద్యోగం కోల్పోయి కూలీలుగా చేయడం వారికి కన్నీళ్లు తప్ప సంతోషం లేకుండా పోయింది.

భువనగిరి, యాదాద్రి జిల్లాలో ఇద్దరూ రూ.300కు పని చేస్తున్నారు. కూలీ పనుల ద్వారా కుటుంబానికి ఎంతో కొంత ఖర్చులు వెళ్లదీసుకోవచ్చనే ఉద్దేశంతోనే కూలీ పనులకు వచ్చినట్లు చిరంజీవి పేర్కొంటున్నారు. తమ ఇంట్లో ఇద్దరు పిల్లలు, తల్లిండ్రులు సహ మొత్తం ఆరుగురం ఉన్నామని, జీతం రాని కారణంగా పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రాష్ట్రంలో 10వేలకుపైగా రికగ్నైజ్డ్, 8వేలకుపైగా అన్ రికగ్నైజ్డ్ స్కూళ్లలో 2 లక్షల మందికిపైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు అంచనా. వారికి గత రెండు నెలలుగా జీతాలు లేవు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సంవత్సరంలో పది నెలలు వరకే వేతనాలు అందుతుండగా, ఈ సంవత్సరం కేవలం 8 నెలలే వచ్చిందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు రూ. 10వేలు, హైస్కూల్‌ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నరూ.20వేల వరకు, కాలేజీ లెక్చరర్లకు (అనుభవం ఉన్నవారికి) రూ.25వేలకుపైగా వేతనాలు అందుతున్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎలాంటి నియమాకాలు లేకపోవడంతో ప్రైవేటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఇది కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 12 సంవత్సరాలుగా సోషల్‌ సైన్స్‌ పాఠాలు బోధిస్తున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోవడంతో కూలీ పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.. అంటూ వాపోయాడు. అంతేకాదు కూలీ పనులలో కూడా పీహెచ్‌డీ చేసిన రమేష్‌, పీటీ ఉపాధ్యాయుడు కృష్ణ , మరెందరో ఉన్నత చదువులు చదివిన వారు కూలీలుగా పని చేసుకుంటున్నారు.

ఇక ఉపాధ్యాయులే కాదు.. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు కూడా ఉద్యోగం కోల్పోయి కూలీలుగా అవతారమెత్తుతున్నారు. అంతేకాకు మార్చి నెల వరకూ లక్ష రూపాయల వరకూ జీతం తీసుకున్న స్వప్న అనే యువతి కూడా ఇప్పుడు కూలీ పనులు చేస్తున్నారు. వీళ్లే కాదు.. ఇంకా ఎందరో ఉన్నత చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండి కూడా చివకూ ఉద్యోగాలు కోల్పోయి కూలీ పనులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు లక్ష రూపాయల జీతం తీసుకున్న నేను.. కరోనా మహమ్మారి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా బతుకులు దారుణంగా తయారయ్యయని స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. పరిస్థితులను బట్టి కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కోల్పోయిన మలాంటి వారు ఎందరో ఉన్నారని, ప్రభుత్వం తరపున ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Next Story