కూరలు, పండ్లు తింటే స్ట్రోక్ రాదండీ.!

By అంజి  Published on  1 March 2020 7:15 AM GMT
కూరలు, పండ్లు తింటే స్ట్రోక్ రాదండీ.!

మనం తినే ఆహారానికి, మనకు వచ్చే వివిధ రకాల స్ట్రోక్స్ కి సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని తాజా పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఉదాహరణకు కూరగాయలు, పళ్లు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకునేవారికి మెదడుకు వెళ్లే రక్తనాళాలలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. గుండె నుంచి మెదడుకు వెళ్లే రక్త నాళాలు పూడుకుపోవడం వల్ల వచ్చే ఇశ్చెమిక్ స్ట్రోక్ కూరగాయలు, పండ్లు తినేవారిలో చాలా తక్కువగా వస్తాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

ఇటీవలే యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో తొమ్మిది యూరోపియన్ దేశాలకు చెందిన 4.80 లక్షల మంది ఇశ్చెమిక్ స్ట్రోక్, అంతర్గత రక్తస్రావంతో పాటు వచ్చిన స్ట్రోక్ పేషంట్లపై చేసిన అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఇందులో పళ్లు, కూరగాయలు, పెరుగు బాగా తీసుకునేవారిలో ఇశ్చెమిక్ స్ట్రోక్ ఉండదని వెల్లడైంది. అదే సమయంలో ఎక్కువగా గుడ్లు తీసుకునేవారిలో రక్తస్రావంతో కూడిన స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా వెల్లడైంది. అయితే కేవలం ఈ ఒక్క కారణమే కాకుండా, కొలెస్టరాల్ లెవెల్, శరీరం బరువు, ఊబకాయం వంటి ఇతర కారనాలు కూడా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులలలో రక్తం గడ్డకట్టడం వల్ల ఇశ్చెమిక్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ లలో 85 శాతం ఇశ్చెమిక్ స్ట్రోక్ లే. హెమొరేజిక్ స్ట్రోక్ లో మెదడులో రక్తస్రావం జరిగి, సమీపంలోకి కణజాలం దెబ్బతినడం జరుగుతుంది. మొత్తం వచ్చే స్ట్రోక్ లలో 15 శాతం ఇలాంటి స్ట్రోక్ లే. స్ట్రోక్ ప్రపంచంలో చావుకు రెండో అతి ముఖ్యమైన కారణం. అయితే ఈ పరిశోధనల్లో వెలుగుచూసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మన ఆహారంలో కొత్తగా చేరిన ప్రతి పది గ్రాముల పీచు పదార్థం వల్ల ఇశ్చెమిక్ స్ట్రోక్ లో 23 శాతం తగ్గుదల ఉంటుంది. అంటే పీచు పదార్థాలు ఎక్కువ తింటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఆ మేరకు తగ్గుతాయి. పళ్లు , కూరగాయలు తగిన మోతాదులో తింటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పది శాతం తగ్గుతాయి. ఇంకేం... పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని, కూరలు, పండ్లు బాగా తినండి. గుడ్లు కూడా తినండి. కానీ తగిన మోతాదులో మాత్రమే.

Next Story