కరోనా భయంతో జైలుకు నిప్పు పెట్టిన ఖైదీలు

By అంజి
Published on : 22 March 2020 9:12 PM IST

కరోనా భయంతో జైలుకు నిప్పు పెట్టిన ఖైదీలు

కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం తో ఆందోళనకు గురైన కోల్‌కతా లోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీలు దాడులకు దిగారు. తమను బయటికి పంపించాలని, లేకపోతే కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందంటూ జైలు అధికారులను కోరారు ఖైదీలు.

అయితే అందుకు నిరాకరించిన అధికారులు, కొందరు ఖైదీలను మాత్రం పదేళ్లకు పైగా జైల్లో గడిపి సత్ప్రవర్తన మరియూ కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇచ్చి వారిని బయటకు పంపారు. దీనితో విచక్షణ కోల్పోయిన మిగిలిన ఖైదీలు జైలుకు నిప్పు పెట్టారు. దీంతో జైలులో మంటలు చెలరేగగా.. ఇదే సమయమని కొందరు జైలు అధికారులపై ఖైదీలు దాడికి దిగారు.దీనితో పలువురు పోలీసు సిబ్బంది, ఖైదీలు గాయపడ్డారు.

ఖైదీలు తప్పించుకునేందుకు జైలు గోడలను పడగొట్టడానికి ప్రయత్నించారు. ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించాల్సివచ్చింది. ఆందోళనకు గురైన ఖైదీలు గార్డులను ఇటుకతో కొట్టడం మరియు ఎత్తైన జైలు గోడలలో కొంత భాగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. కొంతమంది పోలీసు సిబ్బంది తలలు పగలగా.. హింసను నియంత్రించడానికి పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి.

Next Story