జమ్ముకశ్మీర్‌: ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని, శాంతిభద్రతలు పర్యవేక్షిస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి పండగలు జరుపుకునే వీలు లేకుండా ప్రజల కోసం జీవించి, మరణించే వాళ్ళే పోలీసులు. కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ చేసిన పని అందరినీ గడగడలాడిస్తోంది. ఎందుకంటే ఆ ఖాకీ టెర్రరిస్ట్ లతో చేతులు కలిపాడు. అలా అని అతనూ సాదాసీదావాడు కాదు. అతగాడు గత ఏడాది ఆగస్టు 15 న రాష్ట్రపతి చేతులమీదుగా పోలీస్ సాహస అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి టెర్రరిస్టులతో చేతులు కలపడం పోలీసు వర్గాలను షాక్ కి గురి చేసింది.

DSP Devinder Singh

వివరాల్లోకి వెళ్తే.. జమ్ముకశ్మీర్‌లో కీలకమైన శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధుల్లో ఉన్న దేవేందర్ సింగ్ అనే డీఎస్పీ ఆయన.. ఇతగాడు ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. కుల్గాం జిల్లా వాన్ పో అనే ప్రాంతం వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఖాకీ వెంట నవీన్ అహ్మద్ షా అలియాస్ నవీద్ బాబు అనే ముజాహిదీన్ ఉగ్రవాది, రఫీ అహ్మద్ అనే మరో ఉగ్రవాది కూడా ఉన్నారు. దక్షిణ కాశ్మీర్లో గత అక్టోబరులోనూ, గత ఏడాది నవంబరు లోను కొందరు ట్రక్ డ్రైవర్లు-, కూలీలతో సహా 11 మంది నాన్-లోకల్ వర్కర్లను హతమార్చిన వారిలో నవీద్ బాబు నిందితుడు. పోలీసులకు లొంగిపోవలసిందిగా ఈ ఇద్దరు ఉగ్రవాదులకు నచ్ఛజెప్పేందుకే తాను వీరిని ఢిల్లీకి తీసుకువెళ్తున్నానని దేవేందర్ సింగ్ చెప్పినా.. ఆ ఇద్దరు టెర్రరిస్టులు మాత్రం మాత్రం అదేమీ కాదని చెప్పారట.

అఫ్జల్ గురు లేఖ..

నవీద్ బాబు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇతడు తన సోదరుడికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా ఇతని ఆచూకీని కనుగొనగలిగారు. అయితే ఈ ఉగ్రవాది దేవేందర్ సింగ్ తో చేతులు కలిపాడా లేక సింగే ఇతనితో మిలాఖత్ అయ్యాడా ఆయన విషయం తెలియలేదు. మొత్తానికి దేవేందర్ సింగ్ తో బాటు ఈ ఇద్దరు టెర్రరిస్టులనూ అరెస్టు చేసిన పోలీసులు.. శ్రీనగర్, సౌత్ కాశ్మీర్ ప్రాంతాల్లో పలుచోట్ల దాడులు, సోదాలు చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేవేందర్ ఇంటి నుంచి ఒక ఎకె-47 రైఫిల్ ని, రెండు గన్స్ ని కూడా హస్తగతం చేసుకున్నారు. దేవేందర్ శనివారం విధులకు డుమ్మా కొట్టాడని, ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు సెలవు కోసం దరఖాస్తు పెట్టాడని తెలిసింది. .. 2013 లో పార్లమెంటుపై దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు రాసినట్టు చెబుతున్న లేఖతో దేవేందర్ సింగ్ నాడు టాప్ వార్తలకెక్కాడు. ఆ దాడికి ముందు ఢిల్లీలో తాను ఉండేందుకు వసతి ఏర్పాటు చేయవలసిందిగా అఫ్జల్ గురు ఆనాడు ఇతనికి ఈ లేఖ రాశాడట.. దాన్ని బయటపెట్టి దేవేందర్ ‘ సాహసోపేత ‘ గ్యాలంట్రీ పోలీసు అవార్డు కొట్టేశాడు.

DSP Devinder Singh

అయితే ఉగ్రవాదులకు సహకరిస్తూ పట్టుబడిన డీఎస్పీ దేవేందర్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణిస్తామని జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇంటిలిజెన్స్ బ్యూరో, రా సహా అన్ని దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు ఆయనను విచారిస్తారన్నారు. ‘‘అనంతనాగ్‌‌లో ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ఓ పోలీస్ అధికారి పట్టుబడడాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. ఆయనపై విచారణ చేపట్టాం. దేవేందర్‌ను కూడా అరెస్టైన మిగతా ఉగ్రవాదుల మాదిరిగానే పరిగణిస్తాం..’’ అని ఐజీ పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.