మహారాష్ట్ర: కాంగ్రెస్, ఎన్.సి.పి సంకీర్ణ సర్కారు, మద్దతుదారులు 2018లో పుణేలోని కోరేగావ్ లో జరిగిన మత ఘర్షణల కేసుల్ని ఎత్తేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షం బి.జె.పి మాత్రం ఈ డిమాండ్ అనుచితమైనదనీ, నేరుగా నక్సలిజాన్ని ప్రోత్సహించేదనీ దుయ్యబట్టింది.

గతంలో బి.జె.పి సర్కారు ఉద్దేశపూర్వకంగా కొందరు సామాజిక కార్యకర్తల్ని ఈ కేసుల్లో ఇరికించిందని ఆరోపిస్తూ వాళ్లందరికీ పూర్తి స్థాయిలో ఈ కేసులనుంచి విముక్తి కల్పించాలని సంకీర్ణ సర్కారు అమాత్యులు జయంత్ పాటిల్ డిమాండ్ చేశారు. త్వరలోనే బనాయించిన కేసులనుంచి అమాయకులైన సామాజిక కార్యకర్తలకు విముక్తి కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

బి.జె.పి సర్కారు కక్షసాధింపు ధోరణిలో కేసులు నమోదు చేసిన సామాజిక కార్యకర్తలందరిమీదా కేసుల్ని ఎత్తేయాలని కోరుతూ ఎన్.సి.పి ఎమ్మెల్యే ధనుంజయ్ ముండే మహారాష్ట్ర సర్కారుకు ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ కూడా ఈ వాదాన్ని బలంగా సమర్థించారు. కోరేగావ్ భీమా ఉదంతాన్ని ఒక సామాజిక అంశంగా పరిగణనలోకి తీసుకుని గతంలో బి.జె.పి ప్రభుత్వం బనాయించిన కేసుల్ని ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సదరు కేసులో నిందితుల దోషాలను కోర్ట్ గుర్తించింది కనుకనే వాళ్లపై ఆరోపించిన నేరాన్ని బలంగా నమ్మిందనీ, కేవలం కేసు పూర్వాపరాలను పరిశీలించి న్యాయస్థానం నిక్కచ్చిగా వ్యవహరించి, నిందితులపై నమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లనుకూడా తిరస్కరించిందని బి.జె.పి రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అంటున్నారు.

ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్లు దాఖలయ్యాయి. ఈ తరుణంలో నేరుగా కేసుల్ని ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి లేదని బి.జె.పి రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవ్ భండారీ చెబుతున్నారు. గతంలోకూడా ఇలాంటి సందర్భాలు అనేక రాష్ట్ర చరిత్రలో కనిపిస్తాయని ఆయన అంటున్నారు. కానీ కేసుల్ని ఉపసంహరించే విషయంలో తుది నిర్ణయం మహారాష్ట్ర సర్కారుదేనని ఆయన వ్యాఖ్యానించారు.

1818లో ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన పోరాటంలోకూడా ఇదే విధంగా అమాయకులైన దళితులపై కేసుల్నిబనాయించారని మాధవ్ భండారీ చెబుతున్నారు. కోరేగావ్ భీమా ఉదంతంలో ఏమాత్రం ప్రమేయంలేని అమాయకులైన దళిత సోదరుల్ని వెంటనే ఈ కేసులనుంచి తప్పించి తగిన న్యాయం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

మరోపక్క సర్కారుకు సంబంధించిన అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే నేతృత్వం వహించాల్సి ఉండగా ఆయన మేనల్లుడు యువసేన అధ్యక్షుడు వరుణ్ సర్దేశాయ్ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించడాన్ని బి.జె.పి నేరుగ తప్పు పట్టింది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే కూడా హాజరయ్యారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.