ముఖ్యాంశాలు

  • వివేకా హత్యకేసుపై కుమార్తె సునీతకు అనుమానాలు
  • సాక్ష్యాలను తారుమారు చేశారని అసంతృప్తి
  • కేసును నీరుగారుస్తున్నారంటూ డా.సునీత విచారం
  • సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ వేసిన సునీత
  • ప్రభుత్వం కేసు విచారణను పట్టించుకోవడం లేదని ఆవేదన

తెలుగు నేలను కుదిపేసిన వై.ఎస్.వివేకానంద రెడ్డి మరణం మిస్టరీ ఇంతవరకూ వీడలేదు. తన తండ్రి మరణానికి కారణాలను కనుక్కోవడంలో, కేసును ముందుకు వేగంగా నడిపంచడంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండూ అలసత్వం వహిస్తున్నాయని పేర్కొంటూ వై.ఎస్.వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

డాక్టర్ సునీత నర్రెడ్డి, వైఫ్ ఆప్ రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి, సన్నాఫ్ పుల్లారెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె అల్లుడు ఒకటవ రెండవ పిటిషనర్లుగా, వై.ఎస్.వివేకానందరెడ్డి భార్య వై.ఎస్.సౌభాగ్య పేరుకూడా పిటిషనర్ గా పేర్కొనడం జరిగింది. అజాత శత్రువుగా పేరొందిన వివేకానందరెడ్డి ఇతర పార్టీల నేతలు సైతం గౌరవించేవారనీ, అంతటి గొప్ప మనిషిని దారుణంగా హత్యచేస్తే ఇంతవరకూ ఆ హత్యకేసు మిస్టరీని ఛేదించడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నాయని రిట్ లో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ఏపీ, సిట్, కడప, ఎడిజి క్రైమ్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఎస్.హెచ్.ఒ పులివెందులలను రెస్పాండెంట్లుగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో వై.ఎస్.వివేకానందరెడ్డి మరణంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

తన సొంత ఇంటిలోనే మార్చ్ 14వ,2019న అర్థరాత్రి అత్యంత దారుణంగా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసి వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా, పోలీస్ ఉన్నతాధికారులు తామే స్వయంగా కేసు విచారణను పర్యవేక్షిస్తున్నామని చెప్పుకుంటున్నా, రెండు సిట్లు ఏర్పాటైనా ఇంతవరకూ కేసు విచారణలో కనీస పురోగతి కనిపించలేదంటూ డాక్టర్ సునీత రిట్ పిటిషన్ లో హైకోర్ట్ కు తన బాధను విన్నవించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.