ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా..మండలికి డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్సీలు

By రాణి  Published on  21 Jan 2020 6:53 AM GMT
ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా..మండలికి డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్సీలు

టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మండలికి రాసిన రాజీనామా లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ లేఖలో తాను రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకమని డొక్కా పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నంతకాలం పార్టీ ఇచ్చిన సపోర్ట్ ను మరిచిపోలేనిదని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే కావాలని ఆయన ఆకాంక్షించారు. కాగా..మంగళవారం మండలిలో వికేంద్రీకరణ బిల్లు ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో డొక్కా రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

శాసనమండలిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి డొక్కాను ఆప్యాయంగా పలకరించగా... డొక్కా కూడా నవ్వుతూ జగన్‌ను కుశలమడిగారు. వీరిద్దరినీ చూసిన వారంతా డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే డొక్కా తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఎవరికీ టచ్ లేరని తెలుస్తోంది. ఇటు టీడీపీ నేతలు ఆయనతో మాట్లాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డొక్కా మాత్రం ఎవరి ఫోన్ కాల్ కు స్పందించడం లేదని సమాచారం.

మరొక టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగానే సభకు హాజరు కాలేకపోయానని ఆయన వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా మండలికి గైర్హాజరవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ అగ్రనాయకులు కూడా అమరావతికే జై కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు సోమవారం జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కానీ..మండలిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇలా ఎమ్మెల్సీలు మండలికి గైర్హాజరవ్వడంపై యనమల అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు తమ పార్టీ వారితో మాట్లాడారని ఆయన మండలిలో ఆరోపించారు. వికేంద్రీకరణ బిల్లును మండలిలో పాస్ చేసేందుకు వైసీపీ బలం తక్కువగా ఉండటంతో టీడీపీ ఎమ్మెల్సీలను భయపెట్టో...మభ్యపెట్టో బిల్లును పాస్ చేయించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశ పెట్టిన 10 నిమిషాలకే మండలి వాయిదా పడింది. అయితే రూల్ 71 ప్రకాశం ప్రభుత్వ పాలసీపై ఇచ్చిన మోషన్ పై చర్చ జరగాలని బుగ్గన పేర్కొన్నారు. అంతకు ముందే తమ పార్టీ వాళ్ళతో వైసీపీ వారు మాట్లాడారని చేసిన యనమల ఆరోపణలను బుగ్గన ఖండించారు. ‘‘శాసనసభ చేసిన చట్టానికి మండలిలో ప్రాధాన్యం ఇస్తారా..? లేక పాలసీపై మోషన్‌కు ప్రాధాన్యం ఇస్తారా...? సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారు. ముందు వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలి’’ అని బుగ్గన పట్టుబట్టారు. ఆ తర్వాత స్పీకర్ మండలి సభను వాయిదా వేశారు.

Next Story