కుక్కలు కరోనాను పసిగట్టబోతున్నాయా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 May 2020 8:17 AM GMT
కుక్కలు కరోనాను పసిగట్టబోతున్నాయా..?

కొన్ని మెడికల్ స్నిఫర్ డాగ్స్(వాసన పసిగట్టే శిక్షణ తీసుకున్న కుక్కలు) కరోనా వైరస్ మనుషుల్లో ఉందో లేదో కనుక్కునేలా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ లో ఇప్పటికే కుక్కలకు శిక్షణను ఇవ్వడం మొదలైందట.

ట్రైనింగ్ తీసుకున్న కుక్కలు మనుషుల్లో ఇప్పటికే క్యాన్సర్ ఉన్నా, మలేరియా, పార్కిన్ సన్ రోగాలు ఉన్నా కూడా ఈజీగా కనుగొంటూ ఉన్నాయి. మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ను ఉపయోగించి లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ ఇప్పటికే మొదటి అంచె ట్రయల్స్ ను మొదలుపెట్టింది. డర్హం యూనివర్సిటీనే కాకుండా ప్రభుత్వం కూడా ఈ ప్రయోగానికి అండగా నిలిచింది. 500000 పౌండ్లు ప్రభుత్వం సహాయం అందిస్తోంది.

ప్రభుత్వం ఎక్కువగా టెస్టింగ్ లు చేయాలని అనుకుంటూ ఉందని ఇన్నోవేషన్ మినిస్టర్ లార్డ్ బెథెల్ తెలిపారు. అందులో భాగంగానే కుక్కలు ముందుగానే పసిగట్టడం వలన 'వేగంగా ఫలితాలు' వచ్చే అవకాశం ఉందని అన్నారు. రోగిలో కరోనా వైరస్ లక్షణాలు కనపడ్డానికంటే ముందే.. వాసన ద్వారా కుక్కలు వైరస్ ను ముందుగానే గుర్తించేందుకు 'కోవిద్ డాగ్స్' బృందాన్ని రెడీ చేయనున్నారు. బయో-డిటెక్షన్ డాగ్స్ గా చెప్పుకుంటున్న వీటిని గంటకు 250 మంది ప్రజలను స్క్రీనింగ్ చేసే అవకాశం ఉందట. లాబ్రడార్, కాకర్ స్పానియల్స్ జాతులకు చెందిన కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

మొదటి ఫేస్ లో భాగంగా లండన్ హాస్పిటల్స్ వాసనకు సంబంధించిన శాంపుల్స్ ను సేకరిస్తూ ఉన్నాయి. శ్వాస, శరీరం నుండి వచ్చే వాసన, ఫేస్ మాస్కులలో ఉండే వాసన.. వీటన్నిటినీ శాంపుల్స్ కింద పరిగణిస్తూ ఉన్నారు.

ఆరు కుక్కలు నార్మన్, డిగ్బి, స్టార్మ్, స్టార్, జాస్పర్, అషర్ లు ట్రైనింగ్ కు వెళ్ళబోతూ ఉన్నాయి. ఆరు నుండి ఎనిమిది వారాలు వీటికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తీ అయిన తర్వాత ప్రభుత్వం ఆ కుక్కలను ఎక్కడ వినియోగిస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్స్ లాంటి ప్రాంతాల్లో ఈ కుక్కలను వినియోగించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.

కుక్కల మీద 10 సంవత్సరాలకు పైగా చేసిన రీసర్చ్ లో భాగంగా మెడికల్ డిటెక్షన్ డాగ్స్ వాసనను చాలా సులువుగా పసిగట్టగలవు. రెండు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ లో ఒక టీ స్పూన్ చెక్కర ను కలిపితే.. అది ఎక్కడ ఉందో కూడా కనిపెట్టగలవు. కుక్కలు ఖచ్చితంగా కరోనా వైరస్ ను కనిపెట్టగలవని డాక్టర్ క్లైర్ గెస్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి అంచెలో కుక్కలు విజయం సాధిస్తే.. రెండో అంచెలో మిగిలిన ఏజెన్సీలను సంప్రదించి మరిన్ని కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని క్లైర్ తెలిపారు.

గాంబియా దేశంలో గతంలో కొన్ని కుక్కలకు మలేరియాను పసిగట్టే ట్రైనింగ్ ఇచ్చారు. పిల్లలు ఉపయోగించే సాక్సుల ద్వారా మలేరియా ఉందా లేదన్నది మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఈజీగా కనిపెట్టగలిగేవి. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో మానవుడికి కుక్కలు ఏవిధంగా సహాయం చేయగలవో వేచి చూడాలి.

Next Story