విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? – కేసీఆర్‌

By Newsmeter.Network  Published on  16 March 2020 6:50 AM GMT
విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? – కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. దీనిలో తెలంగాణ కూడా చేరింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీఏఏపై కేంద్రం పునః సమీక్షించాలని కోరారు. సీఏఏపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొందని అన్నారు. సీఏఏ బిల్లును పార్లమెంట్‌లో కూడా టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామని సీఎం అన్నారు. ఈ బిల్లు అనేక ఆందోళనలు సృష్టిస్తోందని, గుడ్డిగా మేం వ్యతిరేకించడం లేదని అన్ని అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక మంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఈ దేశానికి ఈ చట్టం అవసరం లేదని కేసీఆర్‌ కుండ బద్దలు కొట్టారు.

రాక్షసానందం పొందుతూ ఈ యాక్ట్ అమలు చేయనవసరం లేదని సూచించారు. ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదని, ఏదో కొంపలు మునిగినట్లు ఇదొక్కటే సమస్య అన్నట్లు కేంద్ర ప్రవర్తిస్తుందని కేసీఆర్ విమర్శించారు. నాకే బర్త్ సర్టిఫికెట్‌ లేదని చెప్పాను.. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవని అన్నారు. పైగా నిన్ను ఎవరు బర్త్ సర్టిఫికెట్‌ అడిగారని అంటున్నారని కేసీఆర్‌ అన్నారు. ఓటర్‌ ఐడీ, ఆధార్‌, రేషన్‌ కార్డు ఏది కూడా పనిచేయదని అంటున్నారని, దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్‌ లేదని, వారి పరిస్థితి ఏంది అనేది కేంద్రం సమాధానం చెప్పాలని కేసీఆర్‌ ప్రశ్నించారు.

చాలా మంది యువ శాసనసభ్యులు ఉన్నారని, వాళ్లు ఇది ఏంది అనుకుంటున్నారని అన్నారు. సీఏఏను మేధావులు, కవులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు వ్యతిరేకిస్తున్నారని, సీఏఏకి వ్యతిరేకంగా కొంత మంది అవార్డులను తిరస్కరిస్తున్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు. దేశంలోకి చొరబాటు దారులు రావాలని ఎవరైనా పిలుస్తా రా..? బోర్డర్‌లో సైనికుల వళ్లనే కదా మనం ప్రశాంతంగా ఉన్నాం అన్నా రు. మెక్సికో వాసులు రాకుండా అమెరికా గోడనే కట్టిందని, భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా అంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు. నాలాగా మాట్లాడే వారిని దేశ ద్రోహి అంటున్నారని, అంటే ఇప్పుడు అసెంబ్లీలో వ్యతిరేఖ తీర్మానం చేస్తే దేశ ద్రోహులమా అంటూ ప్రశ్నించారు.

Next Story