హోమో సెక్సువల్స్ కోసం ఒక డాక్టర్ పోరాటం

By రాణి  Published on  25 Feb 2020 9:48 AM GMT
హోమో సెక్సువల్స్ కోసం ఒక డాక్టర్ పోరాటం

ఆమెది ఒక విచిత్ర పోరాటం. ఎందుకంటే ఆమె ఆమె కాదు. ఆమె అతనిలో ఉన్న ఆమె. అంటే మగరూపులో ఉన్న మహిళ. ఆధునిక భాషలో ట్రాన్స్ జెండర్ అంటారు. ఆమె పోరాటం అంతా మెడికల్ టెక్స్ట్ పుస్తకాల్లో ట్రాన్స్ జెండర్స్ కి జరుగుతున్న అన్యాయం పైనే. పాఠ్యపుస్తకాల్లో స్త్రీలు, పురుషులు కాక, మూడో లింగానికి చెందిన వారి గురించి నెగటివ్ గా ఉన్న వివరాలను తొలగించేందుకే ఆమె ప్రయత్నిస్తోంది. ఆమే డా. సమీరా జాగీర్దార్.

మానవ శరీరంలోని వైచిత్రిని తెలుసుకునేందుకు, ట్రాన్స్ జెండర్ కి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసేందుకు ఆమె మెడిసిన్ చదివింది. కానీ ట్రాన్స్ జెండర్ల లైంగికత గురించి చేసిన అధ్యయనాలు ఆమెకు మనోవేదననే మిగిల్చాయి. సమాజం ఆమె సెక్సువాలిటీని అంగీకరించడం లేదు. ఆమె తన లైంగిక ఇష్టాఇష్టాలను బయటకు చెప్పుకోలేదు. పుదుచ్చేరి లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ లో క్రిటికల్ కేర్, ట్రామా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న సమీరా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక దశలో తనకు ఇష్టమైన పద్ధతిలో జీవించేందుకు తన సొంతూరు పుణే నుంచి పారిపోయేందుకు కూడా సిద్ధపడింది.

మెడిసిన్ పాఠ్య పుస్తకాల్లోనూ హోమో సెక్సువాలిటీను ఒక నేరంగా పరిగణించడం జరిగింది. వారు తమ భావాలు చెప్పుకోవడానికి కావలసిన వాతావరణం లేదు. అన్ని చోట్లా హోమో సెక్సువాలిటీ ఒక నేరమన్న భావన తాండవించేది. దీంతో ఆమెలో ఒంటరితనం పెరిగిపోయింది. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది.

తరువాత జిప్ మర్ చదువుతున్న సమయంలో తన పరిస్థితి మానసిక లేదా శారీరక వ్యాధి కాదని, ఇదొక జీవన శైలి అని అర్థం అయింది. అమెరికన్ సైకియాట్రిక్ సొసైటీ దీని పై చాలా అధ్యయనాలు చేసిందన్న విషయం కూడా బోధపడింది. అప్పట్నుంచీ ఆమె తన ఆత్మన్యూనతను వదిలేసి, లింగ మార్పిడి చేయించుకున్నారు. పూర్తిగా స్త్రీ గా మారింది. 2003 నుంచి ఇక సమలైంగికుల హక్కుల గురించి పోరాటం ప్రారంభించింది వారి సమస్యలను గురించి మిగతా సమాజంలో అవగాహన పెంచే పనిని కూడా చేపట్టింది. ఈ పోరాటాన్ని ఇప్పుడు అన్నామలై యూనివర్సిటీ గుర్తించి, ఆమె రచనలు పరిశోధనలకు స్థానాన్నిచ్చింది. నర్సుల కోసం నిర్వహించే కోర్సుల్లో ఈ విషయాలను పాఠ్యాంశాలుగా చేసింది. తమిళనాడు ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా తన రాష్ట్రంలో వివిధ విభాగాలతో కూడిన ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసింది. ఆమె ప్రయత్నాలను ప్రశంసించింది.

Next Story