చర్లపల్లి జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత....రంగంలోకి దిగిన పోలీసులు

By Newsmeter.Network  Published on  30 Nov 2019 7:55 PM IST
చర్లపల్లి జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత....రంగంలోకి దిగిన పోలీసులు

తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు అరెస్టు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. వెటర్నరీ వైద్యురాలు హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, నలుగురు నిందితులకు 14 రోజుపాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. నిందితులను షాద్‌నగర్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లికి తరలించారు. నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం. నిందితులు జైలు వద్దకు రాగానే భారీ ఎత్తున ఆందోళనకారులు జైలు వద్దకు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ డిమాండ్‌ చేశారు.లేని పక్షంలో వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

Next Story