దివ్యది హత్యే.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

By సుభాష్  Published on  24 Oct 2020 7:28 AM GMT
దివ్యది హత్యే.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

ప్రేమోన్మాది చేతిలో బలైన విజయవాడకు ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులు సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసుల విచారణ పూర్తయింది. దివ్యది హత్యేనని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా దివ్యది హత్యేనని పోలీసులు నిర్దారించారు. దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం అబద్దమని తేల్చారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈనెల 28న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆస్పత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్ఝ్ కాగానే అదుపులోకి తీసుకుని విచారించి మరికొన్ని విషయాలు రాబట్టారు. అలాగే ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను సైతం పరిశీలిస్తున్నారు. కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండకు చెందిన వంకాయలపాటి దివ్య తేజర్వి (22)ని బుడిగి నాగేంద్రబాబు (25) కత్తితో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, పలువురు మంత్రులు సైతం పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అనేక మలుపులు తిరిగిన కేసు

కాగా, ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. దివ్య, నాగేంద్రబాబు పెళ్లి చేసుకున్నారని ఇటు నాగేంద్రబాబు సోదరుడు చెబుతుండగా, మా అమ్మాయి ఎవరినీ ప్రేమించలేదని, పెళ్లి చేసుకోలేదని దివ్య కుటుంబ సభ్యులు పోలీసుల ముందు చెప్పారు. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి చెప్పాడని అతని సోదరుడు చెబుతున్నాడు. ఇదిలావుంటే.. నాగేంద్రబాబుతో ప్రేమ, పెళ్లి విషయాన్ని దివ్య తల్లి ఖండించిన విషయం తెలిసిందే. బీటెక్‌ చదివిన తన కుమార్తె .. పెయింటర్‌గా పని చేసుకునే నాగేంద్రతో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. వాళ్లిద్దరికి పెళ్లి జరిగిందని అబద్దాలు చెబుతున్నారని, అలాంటి పుకార్లు పుట్టించవద్దని తల్లి వేడుకుంటోంది.

ఇదిలా ఉంటే వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో దివ్య మెడలో తాళి బొట్టు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం, ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే వివాహం జరిగే ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నాగేంద్రబాబును దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, చివరికి దివ్యది హత్యేనని పోలీసులు తేల్చారు.

Next Story