దివ్య హత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

By రాణి  Published on  19 Feb 2020 12:08 PM GMT
దివ్య హత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగిని దివ్య(25) హత్య కేసులో మిస్టరీ వీడింది. చదువుకున్న రోజుల్లో తన వెంట ప్రేమించమని వెంటాడి, ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న వెంకటేష్ ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వేములవాడ పోలీసులకు నిందితుడు వెంకటేష్ లొంగిపోయాడు. మరోవైపు దివ్య మృతదేహానికి పోస్టు మార్టం పూర్తై..ఇంటికి చేర్చారు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది. దివ్య మృతదేహాన్ని చూడగానే..ఆమె తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు పెట్టిన రోదనలు ఇతరులచేత కూడా కంట తడి పెట్టించాయి. దివ్యకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన తరుణంలో..దివ్య హత్య ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. మంత్రి కేటీఆర్ దివ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తిగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

దివ్య హత్య పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంకటేష్ మామ న్యాయవాది అవడంతో..అతని అండచూసుకునే ఇంత దారుణానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు. నిందితుడు వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

మంగళవారం గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దివ్య (25) దారుణ హత్యకు గురైంది. దివ్య ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. విధులు ముగించుకుని తన రూమ్‌కు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడను కోసి దారుణంగా చంపేశారు.

దివ్య, వెంకటేష్‌ ప్రేమ వివాహం చేసుకున్నారని వెంకటేష్‌ తండ్రి పరశురాం మీడియాకి తెలిపారు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, వెంకటేష్‌పై ఎల్లారెడ్డి పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి దివ్యతో సంబంధాలు లేవని పరశురాం వివరించారు. నిన్న సాయంత్రం నుంచి వెంకటేష్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోందన్నారు.

Next Story