విడాకులు ఏ నెలలో ఎక్కువగా తీసుకుంటారో తెలుసా?
By Newsmeter.Network Published on 3 Jan 2020 7:57 AM GMTపండగ నాడు కూడా పాత మొగుడేనా... అన్నది మన సామెత. కానీ అమెరికాలో మాత్రం “కొత్త సంవత్సరం కూడా పాత మొగుడేనా” అని అడుగుతున్నారట. అమెరికాలో జనవరిని విడాకుల నెల అంటారట. ఎందుకంటే ఎక్కువ మంది కొ్త్త క్యాలెండర్ తో పాటు కొత్త మొగుడిని తెచ్చుకుందామని విడాకుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారట. అలాగే మగవారు మరో భార్య కోసం ముందడుగు వేస్తున్నారట.
ఇదేదో ఆషామాషీ కథ కాదండోయ్. నిజంగానే అమెరికాలో జనవరి నెల విడాకుల నెలగా మారిపోతోంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వారు 2001 నుంచి 2015 వరకూ జరిగిన విడాకులన్నిటినీ నిశిదంగా అధ్యయనం చేశారు. వారి అధ్యయనం ప్రకారం జనవరి నెలలోనే మాగ్జిమమ్ డైవోర్సులు అవుతున్నాయట. గూగుల్ ట్రెండ్స్ కూడా అధ్యయనపూర్వకంగా మిన్నెసోటా, ఒహాయో, అరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో జనవరిలోనే విడాకుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపింది. కొత్త సంవత్సరం కొంగొత్తగా మొదలుపెట్టాలన్న తహతహ కొత్త మొగుడిని, కొత్త పెళ్లాన్ని వెతుక్కునేలా చేస్తోందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఇక మరీ చివికిపోయి, ప్రాణం లేకుండా అయిపోయిన వైవాహిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన వాళ్లు జనవరి నెలరాగానే డైవోర్సు పేపర్సు ఫైల్ చేస్తున్నారు.
అయితే చాలా మంది భార్యాభర్తలకు డిసెంబర్ నెలాఖర్లో వచ్చే క్రిస్మస్ సెలవులు సంబంధాలు మళ్లీ గట్టిపరచుకునేందుకు కూడా ఉపయోగపడుతున్నాయట. ఇక లాభం లేదనుకున్న వారు మాత్రం ఇవే సెలవులను లాయర్లను కలిసి విడాకుల పత్రాలను తయారు చేయిస్తున్నారట.