కరోనా వైరస్‌ తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, పలువురు అనుమానితులు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ను వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను రాష్ట్రంలోనూ సమర్థవంతంగా అమలు చేస్తుంది. అయిన రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలాఉంటే కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధికి పలువురు వితరణ అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వానికి కోట్లలో వితరణ అందజేశారు. తాజాగా కరోనా నివారణకు సీఎం సహాయనిధికి సింగరేణి కార్మికులు రూ. 7.80కోట్లను వితరణగా అందజేశారు. ఈ విషయాన్ని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు. వేతనం నుంచి ఒక్కరోజు డీఏను కార్మికులు వితరణగా ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆ చెక్‌ను అందజేస్తామని వెంకట్రావు తెలిపారు.

Also Read :కాంటాజియన్‌ సినిమా చూడండి.. వైరస్‌ వ్యాప్తి ఎలా జరుగుతుందో అర్థమవుతుంది..

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ ప్రభావంతో పనులు లేక సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబం సినీ కార్మికులు, హెల్త్‌ వర్కర్లకు రూ. కోటి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖులు నిర్మాత సురేశ్‌బాబు, హీరోలు వెంకటేశ్‌, రానాలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమానికి మెగాస్టార్‌ చిరంజీవి రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విధితమే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్