దిశ అత్యాచారం కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసి పోలీసులు సీఎంను, కోర్టుల్ని తప్పుదోవపట్టించారు..

By Newsmeter.Network  Published on  8 Dec 2019 12:23 PM GMT
దిశ అత్యాచారం కేసు నిందితులను ఎన్ కౌంటర్  చేసి పోలీసులు సీఎంను, కోర్టుల్ని తప్పుదోవపట్టించారు..

హైదరాబాద్ : మహాపరినిర్వాణ్ దివస్ - భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేత్కర్ జయంతి పర్వం. భారతీయ చట్టాలను పకడ్బందీగా నిర్మించి, జాతికి మార్గ నిర్దేశం చేసిన ఈ మహనీయుడి ఆశయాలకు తెలంగాణ పోలీసులు తూట్లు పొడిచారు.

జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలిగామనుకున్నారేగానీ మొత్తంగా రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నామన్న ఆలోచన వాళ్ల మదిలో ఏమాత్రం కలగలేదు. దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ తో వాళ్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు వచ్చి ఉండొచ్చు.

కానీ అంతరాత్మకు మాత్రం వాళ్లు సమాధానం చెప్పుకోలేదు. దేశ న్యాయవ్యవస్థ వాళ్లను దోషులుగా గుర్తించే అవకాశం కలగకపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ అంతరాత్మ అనే న్యాయస్థానంలో వాళ్లు పూర్తిస్థాయిలో దోషులుగా నిలబడి తీరాల్సిందే.

చట్టాన్ని గౌరవించడం, న్యాయానికి కట్టుబడి ఉండడం దేశ పౌరలందరి బాధ్యత. దీనికి ఏ ఒక్కరికీ మినహాయింపు లేనేలేదు. నిజానికి బాధ్యత కలిగిన అధికారులు మరింత శ్రద్ధాసక్తులతో రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చట్టాన్ని రక్షించాల్సినవాళ్లే దాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం విస్మయాన్ని కలిగించిన అంశం. చిన్న చిన్న లోపాలను ఆధారం చేసుకుని చట్టానికి, న్యాయానికి తూట్లు పొడవడం క్షమించరాని నేరమే అవుతుంది.

అలాగని అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవాళ్లను శిక్షించే అవకాశం ఉంటుందా అంటే పూర్తి స్థాయిలో అదీ జరుగుతుందనికూడా చెప్పడం కష్టమే. ఎందుకంటే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని, తమంతట తామే ఒక నిర్ణయం తీసుకుని చట్టానికీ, న్యాయానికీ అతీతంగా సత్వర న్యాయం పేరుతో తమకు తోచింది చేసేశారనీ నిరూపించడంకూడా ఏమంత సులభమైన పనేంకాదు.

సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్

డిసెంబర్ ఆరో తేదీన అర్థరాత్రి సమయంలో క్రైమ్ సీన్ ని రీ కన్ స్ట్రక్ట్ చేసేందుకు క్రైమ్ స్పాట్ కి నలుగురు నిందితులనూ తీసుకెళ్లామని, ఆ ప్రయత్నంలో ఉన్న సమయంలో నిందితులు ఊహించని రీతిలో పోలీసుల దగ్గరున్న రెండు సర్వీస్ రివాల్వర్లను లాక్కుని కాల్పులు మొదలుపెట్టారని, మరొకరు రాళ్లతో దాడి చేశారని, ఇంకొకరు కర్రలతో పోలీసులను చావబాదే ప్రయత్నం చేశారని, తేరుకున్న పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారనీ, కొద్ది సేపటితర్వాత అంటే పరిస్థితి సద్దుమణిగిన తర్వాత చూస్తే నలుగురు నిందితులు విగతజీవులై పడి ఉన్నారనీ సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు చెప్పారు.

సైబరాబాద్ పోలీస్ టాప్ బాస్ ఇదే కథను పదేపదే పలుమార్లు వినిపించడంద్వారా ఫేక్ ఎన్ కౌంటర్ ని నిజమైన ఎన్ కౌంటర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజానికి పోలీస్ టాప్ బాస్ లుకూడా దీన్నే సమర్థిస్తూ ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని నొక్కి వక్కాణించారు.

వరంగల్ యాసిడ్ దాడి ఘటన నిందితుల విషయంలోకూడా అచ్చంగా ఇలాగే జరిగింది. కాలేజీకి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ తో దాడి చేసిన శ్రీనివాస్ అనే నిందితుడు, అతనిని దాడికి పురికొల్పి, సాయం చేసిన మరో ఇద్దరు నిందితులుకూడా అచ్చంగా ఇలాగే సినీ ఫక్కీలో ఎన్ కౌంటర్ లో మరణించారు.

ఆత్మరక్షణ కోసం పోలీసులు

యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుల దగ్గర ఆయుధాలుకూడా ఉన్నాయనీ, వాటిని చూపిస్తామని చెప్పి తీసుకెళ్లి నిందితులు పోలీసులపై దాడికి తెగబడ్డారనీ, ఆత్మరక్షణకోసం పోలీసులు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో నిందితులు మరణించారనీ, అప్పట్లో వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్న సజ్జనార్ మీడియాకు తెలిపారు.

ఏమాత్రం సంకోచం లేకుండా ఈసారికూడా సరిగ్గా అదే కథను మరో కోణంలో వినిపించడంద్వారా సక్సెస్ సాధించామని పోలీసులు భావించారు. నిజానికి ఒకసారి అలాంటి చేదు అనుభవం ఎదురైనప్పుడు, నిందితులను క్రైమ్ స్పాట్ కి తీసుకెళ్లినప్పుడు వాళ్లు దాడి చేసే ప్రమాదం ఉంటుందని ముందుగానే ఊహించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది.

మీడియా ఛానళ్లను, డిపార్ట్ మెంట్ కి చెందిన వీడియోగ్రాఫర్లను పిలిచి జాగ్రత్తగా వాళ్ల కళ్లముందే క్రైమ్ సీన్ ని రీకన్ స్ట్రక్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సింది. అప్పుడు అంతమంది మధ్యలో తాము ఉన్నామన్న భయంతోనైనా, తాము ఏం చేసినా సరే మీడియాలో వచ్చేస్తుందన్న భయంతోనైనా వాళ్లు దాడికి యత్నించి ఉండేవారు కారేమో. లేదూ అలా దాడికి యత్నించినా మీడియా వీడియోగ్రాఫర్లు, డిపార్ట్ మెంట్ కి చెందిన వీడియోగ్రాఫర్లు చిత్రీకరించిన దృశ్యాల్లో నిందితులు చేసిన దాడికి సంబంధించిన ప్రత్యక్ష దృశ్యాలు రికార్డై ఉండేవికదా.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు - వేగవంతమైన సత్వర న్యాయం

దిశ కేసులో సత్వర న్యాయం జరిపించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగానేకాక, దేశ వ్యాప్తంగాకూడా విపరీతంగా నిరసన వెల్లువెత్తింది. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణను వేగవంతం చేసేందుకు, సత్వర న్యాయం జరిపించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైకోర్టుకూడా దీనికి వెంటనే అనుమతి ఇచ్చింది.

ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యర్థమైపోయినట్టే లెక్క. పోలీసులు అటు ముఖ్యమంత్రినీ, ఇటు న్యాయ వ్యవస్థనూ అపహాస్యం పాలు చేశారు. పటిష్టమైన న్యాయవ్యవస్థకు తూట్లు పొడిచినట్టుగా తమకుతాముగా తాము చేయదలచుకున్న న్యాయం చేసేశారు. తామే జడ్జి, జైలర్ స్థానాల్లో ఉన్నట్టుగా ఆలోచించుకుని నిర్ణయం తీసేసుకుని, తామే ఆ నిర్ణయాన్ని అమలు చేసేశారు.

ఒకే ఒక్క నిర్ణయంతో పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటైన ప్రభుత్వం, చట్టం, న్యాయం, దర్యాప్తు సంస్థలు, జైలు యొక్క గౌరవాన్నీ, అధికారాన్నీ ప్రత్యేకించి ఈ కేసులో నీరుగార్చిపారేశారు. ఇలా సత్వర న్యాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు న్యాయస్థానాలు, జడ్జీలు, శిక్షను అమలుపరిచే కారాగారాల అవసరం ఏంటన్నది అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.

కోర్టుల మనుగడ ప్రశ్నార్థకం

న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం కావడానికి, న్యాయం లభించడానికీ చాలా ఆలస్యం అవుతుందికనుక, అటు కక్షిదారులకు, ఇటు ప్రభుత్వానికీ బోలెడంత ఖర్చవుతుందికనుక, ఆ ఖర్చుల రూపేణా బోలెడంత ప్రజాధనం వృథా అవుతోందికనుక పూర్తిగా కోర్టులను ఎత్తేయాలన్నది కొందరు పౌరుల డిమాండ్. నిజానికి ఆ వాదనను పరిగణనలోకి తీసుకున్నట్టైతే వందల కొద్దీ అత్యాచారం కేసుల్లో ఏళ్లుగా న్యాయస్థానాల్లో విచారణకు హాజరవుతున్న నిందితుల భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకమే అవుతుంది. ఇంకా అసలు విచారణలు, వాదనలు కొనసాగించాల్సిన అవసరం ఉందా? లేక పూర్తిగా వాటిని ఎత్తేయడంవల్ల సత్వర న్యాయంకోసం కొత్త దారులు తొక్కడంవల్ల లాభం ఉంటుందా? అన్నది గట్టిగా ఆలోచించుకోవాల్సిన సమాధానం లేని ప్రశ్న అవుతుంది.

ఇప్పుడు దిశ కేసులో పోలీసులు చేసిందే న్యాయం అయితే రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన కోర్టుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పోలీస్ అధికారులకు చేతికి ఒక తుపాకీ ఇచ్చి వదిలిపెడితే ఇటువంటి చాలా కేసుల్లో సత్వరన్యాయం జరిగే వీలుంటుందికదా? అప్పుడు అసలు నిందితులు నేరం చేశారా లేదా అని విచారణ జరపడానికి, దానికి పూర్తి స్థాయిలో సమయం కేటాయించడానికి అస్కారమే ఉండదు, అసలు ఆ అవసరమే ఉండదు.

కొద్దికాలం తర్వాత అసలు ఈ కేసుతో నిందితుల్లో ఒకరికి ఏమాత్రం సంబంధం లేదన్న విషయం రుజువైతే పరిస్థితి ఏంటి? ఇంకొకరు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారన్న విషయం కాలక్రమంలో బయటపడితే అప్పుడు పరిస్థితి ఏంటి?

భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19(1) (a)

భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19(1) (a) కింది ఎవరైనా దీని గురించి ప్రశ్నించగలరా లేదా సమాచారం రాబట్టగలరా లేక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరా? సరే నిందితులు నిజంగా క్రైమ్ స్పాట్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారే అనుకుందాం కొంచెం సేపు, అంటే మనపోలీసులు సమర్థతలేనివాళ్లు మన పోలీస్ వ్యవస్థ సమర్థమైనది కాదు అని మనం అనుకోవచ్చా?

నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తారన్న ముందస్తు ఆలోచన పోలీసులకు రాదా? దాని ప్రకారం అలా జరగకుండా చూసుకునేందుకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేసుకోరా? కస్టడీలో ఉన్న నిందితులు పోలీసులకు దాడికి ప్రయత్నించి, వాళ్ల దగ్గరున్న రివాల్వర్లను లాక్కొని వాళ్లమీదే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారనే కథనాన్ని మనం నమ్మితీరాల్సిందేనా?

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన న్యాయమూర్తులు. అంతమాత్రం చేత ఎక్కువమంది జనం ఏది అనుకుంటే అదే న్యాయం అవుతుందని భావించడానికీ లేదు. ఇలాంటి నేరాలు చేసినవాళ్లకు చట్టపరంగా, న్యాయపరంగా కఠినమైన దండన విధించేందుకు పూర్తిగా వీలవుతుందన్నది సత్యమే కదా. మరి అలాంటప్పుడు చట్టాన్నీ, న్యాయాన్నీ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలు

సోషల్ మీడియాతోపాటుగా పలువురు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలుకూడా ఈ ఎన్ కౌంటర్ ని పూర్తి స్థాయిలో సమర్థించారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్ కౌంటర్ ని స్వాగతించాయి. సైబరాబాద్ పోలీసులకు సామాన్యులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో ఎన్ కౌంటర్ పై హర్షాన్ని వ్యక్తం చేసే కామెంట్లు తామరతంపరగా వెల్లువెత్తాయి.

ట్విట్టర్ గురువులు తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని హీరోలుగా అభివర్ణిస్తూ అభిమానాన్ని అక్షరాల రూపంలో కురిపించారు. ఇతర రాష్ట్రాలుకూడా ఇదే రీతిలో సత్వరమే న్యాయం చేసే ప్రయత్నం చేయాలన్న వాదనలూ వినిపించాయి. జాతీయ స్థాయిలోకూడా ఇదే రీతి సరియైనదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో ఓవర్ నైట్ హీరోలైపోయారు.

దురదృష్టవశాత్తూ తెలంగాణ పోలీసుల చర్యకు జాతీయ స్థాయిలో ప్రజలందరినుంచీ పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. కానీ ఒక చట్టవిరుద్ధమైన పని చేసిన నిందితులను చట్టవిరుద్ధమైన రీతిలోనే శిక్షించడం ఏమాత్రం సమంజసం కాదన్న విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునే స్థితికూడా కనిపించలేదు సోషల్ మీడియా కామెంట్ల పర్వంలో.

పదిరోజుల్లో పరిపూర్ణ న్యాయం

కొందరు సీనియర్ జర్నలిస్టులు, కథారచయితలు, కళాకారులు, మేథావులుగా పేరుపొందినవారు ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలంగాణ పోలీసుల ఘనతను వేనోళ్ల కొనియాడారు. అంతకు మించి ఈ ఘటనను “ పదిరోజుల్లో పరిపూర్ణ న్యాయం ” పేరిట తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన సామాజిక సంక్షేమ పథకం అన్న రీతిలో చాలామంది కీర్తించారుకూడా. అదికూడా ఈ ఘటన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేత్కర్ జయంతి రోజున జరిగింది.

జనం చెప్పినట్టుగా, దేశంలో అత్యధిక శాతం ప్రజలు భావించినట్టుగా తెలంగాణ పోలీసులు చేసిందే సరైనపని అయితే ప్రతి నగరంలోనూ పోలీస్ కమిషనర్ కి చీఫ్ మెట్రోపాలిటల్ జడ్జ్ గా అదనపు బాధ్యతలు అప్పగించాలి. టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని సదరు కమిషనర్ ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారికి ఆయుధాన్ని ఇచ్చి సత్వర న్యాయం జరిపించేందుకు, నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసేందుకు వీలుగా వెంటనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించాలి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం, చేసిన ఈ పని సెన్సేషనల్ మీడియా, అసలు సెన్సే లేని సోషల్ మీడియా ప్రోద్బలంతో చేసిన అర్థంలేని పనిగా భావించాల్సి ఉంటుంది. ఆధారాల గురించి పట్టించుకోకుండా కేవలం మానసిక భావనలను ఆధారం చేసుకుని తీసుకున్న బలహీనమైన నిర్ణయంగా అభివర్ణించాల్సి ఉంటుంది.

ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కొందరు నేర ప్రవృత్తికలిగిన వ్యక్తులు ఒక జట్టుగా ఏర్పడి బలహీనమైన ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేస్తారు. అప్పుడు ఒక పోలీస్ అధికారుల బృందం తమ కస్టడీలో ఉన్న నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసేస్తారు.

నిందితులు పోలీసులకు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు. విచారణకు సహకరించరు. సరిగ్గా అలాంటి అబద్ధాలనే పోలీస్ అధికారులు కూడా తాము చేసిన పనిని సమర్థించుకునేందుకు చేస్తారు. అప్పుడు నేరం చేసిన వారికీ, అలాంటి నేరాలు జరగకుండా చూడాల్సిన, ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులకూ తేడా ఏం ఉంటుంది?

ఇదే నిజమైతే, సరైనదైతే పోలీసులు ప్రతిసారీ తమ హీరోయిజాన్ని చాటుకునేందుకు కస్టడీలో ఉన్న నిందితుల్ని కాల్చి చంపేస్తారు. ఇదంతా అచ్చంగా సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం కట్టిన రజనీకాంత్ హీరోయిజాన్ని తలపిస్తుంది. కేవలం సినిమాలో మాత్రమే కొట్టడం, చంపడం లాంటి చర్యలకు పాల్పడి హీరో ఒంటిచేత్తో న్యాయం చేసేయడం వీలవుతుంది. నిజానికి ప్రజాస్వామ్యంలో అలా జరగానికి వీల్లేదు.

కానీ ఆ సినిమాను చిన్నాపెద్దా, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులుకూడా అత్యంత ఆసక్తికరంగా చూస్తారు. ఆ సినిమా హీరోను ఆరాధిస్తారు. అలా సినిమాలో హీరోను ఆరాధించేవాళ్లంతా నిజజీవితంలో ఆ హీరో స్థాయిలో కనిపించే వ్యక్తులనూ ఆరాధించడం మొదలుపెడతారు. ఆ హీరోకీ, ఆ హీరోలా కనిపించే పోలీస్ అధికారులకూ వందలకొద్దీ వేలకొద్దీ అభిమానులు ఏర్పడతారు. అలా హీరోయిజం చూపించడమే సిసలైన న్యాయం అన్న భావన బాగా పెరిగిపోతుంది.

అంబేత్కర్ - రాజ్యాంగం

డెబ్భైఏళ్లక్రితం డా. అంబేత్కర్కు రాజ్యాం గాన్ని నిర్మించేటప్పుడు, దానిలో పొందుపరచాల్సిన చట్టపరమైన అంశాల గురించి లోతుగా ఆలోచించాల్సినప్పుడు అసలు ఇలాంటి ఆలోచనలకు తావుంటుందన్న సత్యం తెలియలేదు. ఎందుకంటే ఆయన ఇలాంటి హీరోయిక్ సినిమాలు అప్పట్లో చూసి ఉండకపోవచ్చు లేదా అలాంటి సినిమాలు అప్పట్లో వచ్చి ఉండకపోవచ్చు.

ఆనాడు అంబేత్కర్ కు అలాంటి సినిమాలు చూసే అవకాశం ఉండిఉంటే ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరహాలో, ఆయన టీమ్ తరహాలో సత్వర న్యాయాన్ని అందించగలిగే అవకాశం గురించికూడా ఆయన ఆలోచించి ఉండేవారేమో! అదే గనక జరిగితే అప్పట్లో ఆయన తప్పకుండా మన రాజ్యాంగంలో " రజనీకాంత్ క్లాజ్ " పేరుతో ఒక ప్రత్యేకమైన క్లాజ్ ని పొందుపరచి ఉండేవారేమో!

ఎమ్.శ్రీథర్ ఆచార్యులు

ఎమ్.శ్రీథర్ ఆచార్యులు పూర్వ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ప్రస్తుతం బెన్నెట్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా డీన్ .

Next Story