హైదరాబాద్‌లో జరిగిన దిశ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణలో భాగంగా పోలీసులపై తిరగబడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజాయోజన వాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.  ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకు సలహాలు, సూచనలతో హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ కేసు విచారణకై విశ్రాంతి న్యాయమూర్తులను సూచించాలని ప్రతివాదులకు సూచించింది.

అదే విధంగా ఈ కేసు విచారణకై విశ్రాంత న్యాయమూర్తులను సూచించాలని ప్రతివాదులకు సూచించింది. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్ అరవింద్‌ బాబ్డే స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. రిటైర్డు న్యాయమూర్తితో ఈ కేసు దర్యాప్తు పరిశీలిస్తామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీల జాబితాను ప్రతివాదులకు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా. ఎన్‌కౌంటర్‌ కేసును తెలంగాణ హైకోర్టు చూసుకుంటుందని, ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక నిజాలను సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి వెలికితీస్తారని, ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయమేమిటి’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ నుంచే సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఎన్‌కౌంటర్ కేసు పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి పీవీ రెడ్డిని సంప్రదించగా.. ఆయన ఇందుకు నిరాకరించారని సీజేఐ జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని కోర్టుకు విన్నవించారు. తమ అభిప్రాయం వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దని ఆయన కోరారు. దీంతో దర్యాప్తునకై సలహాలు, సూచలనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.