గాంధీలోనే 'దిశ' నిందితుల మృతదేహాలు

By రాణి  Published on  13 Dec 2019 11:06 AM GMT
 గాంధీలోనే దిశ నిందితుల మృతదేహాలు

హైదరాబాద్ : చటాన్ పల్లి ఎన్ కౌంటర్ నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే విషయమై శుక్రవారం హై కోర్టులో విచారణ జరిగింది. నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణపై సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలిచ్చేంతవరకూ మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని హై కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కమిటీ విచారణలో భాగంగా మృతదేహాలను పరిశీలించే అవకాశాలున్నాయి. విచారణ కమిషన్ రీ పోస్టుమార్టం అడిగే అవకాశం ఉండటంతో మృతదేహాలు డి కంపోస్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఎన్‌కౌంటర్‌పై వీఎస్‌ సిర్‌పుర్కార్‌ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ వీఎస్ సిర్‌పుర్కార్‌, బాంబే హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ రేఖా ప్రకాష్, రిటైర్డ్‌ సీబీఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ను కమిషన్ సభ్యులుగా సుప్రీంకోర్టు నియమించింది. కమిషన్‌కు సీఆర్ఫీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని.. కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కమిషన్‌ విచారణపై మీడియా కవరేజ్‌ ఉండకూడదని పేర్కొంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story
Share it