కరోనా బారిన తండ్రి.. చక్రాల కుర్చీలోనే కొడుకు మరణం..

By Newsmeter.Network  Published on  4 Feb 2020 11:02 AM GMT
కరోనా బారిన తండ్రి.. చక్రాల కుర్చీలోనే కొడుకు మరణం..

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 400 మందికి పైగా మంది మృత్యువాత పడగా.. వందల సంఖ్యలో దీని బాధితులు ఉన్నారు. కరోనా వైరస్‌ వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన చూస్తే హృదయం ద్రవించక మానదు. పుట్టికతోనే అంగవైకల్యం.. చక్రాల కుర్చీకే పరిమితం.. తల్లి చిన్నప్పుడే చనిపోగా.. తండ్రి ఆ బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అండగా ఉంటున్న తండ్రి కరోనా వైరస్ బారీన పడగా.. ఆకలితో అలమటించి ఆ చిన్నారి మరణించాడు.

చైనాలోని హుబి ప్రావిన్స్‌కు చెందిన యాన్‌ జియోవెన్‌ జంటకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన యాన్‌ చెంగ్ (17)కు పుట్టుకతోనే సెరబ్రల్‌ పాల్సీ వ్యాధి రావడంతో చక్రాల కుర్చీకే పరిమితం కాగా.. చెంగ్‌ 11 ఏళ్ల తమ్ముడు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఇద్దరు కొడుకులు అంగవైకల్యంతో పుట్టడంతో మనస్తాపానికి గురైన జియోవెన్‌ భార్య పదేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. తల్లి దూరమైన ఇద్దరు బిడ్డలను ఆ తండ్రి కంటికి రెప్పగా కాపాడుకుంటున్నాడు.

కాగా ఇటీవల యాన్‌ జియోవెన్‌, తన చిన్న కొడుకుతో ఓ పని నిమిత్తం కలిసి వుహాన్‌ నగరానికి వెళ్లొచ్చాడు. దీంతో వీరిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. జనవరి 22న వీరిద్దరిని ఆస్పత్రిలో చేర్చించగా.. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిద్దరిని ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. దీంతో యాన్‌ చెంగ్‌ ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. కాగా తన కొడుకుకు ఎవరినైనా సహాయంగా పంపాల్సిందిగా జియావెన్‌ అధికారులను కోరాడు. అదే విధంగా తమ పరిస్థితిని వివరిస్తూ.. సోషల్‌ మీడియాలో సహాయం కోసం అర్థించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో యాన్‌ చెంగ్‌ జనవరి 29న చనిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన హృదయాలను కలచివేసిందని.. ఇంతకన్నా అమానుషమైన చర్య మరొకటి ఉండదని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Next Story