అప్పట్నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నా : శంకర్
By రాణి Published on 26 Feb 2020 7:07 PM IST
విశ్వ విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా..కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడు శంకర్ తాజాగా జరిగిన క్రేన్ ప్రమాదంపై స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ట్విట్టర్ వేదికగా..తన బాధను నెటిజన్లతో పంచుకున్నారు.
''ఎంతో దుఃఖంతో ఈ ట్వీట్ చేస్తున్నాను. ఇంకా నేను ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఇతర సిబ్బందిని కోల్పోవడం ఎంతో బాధగా ఉంది. ప్రమాదం జరిగనప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. తృటిలో క్రేన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను గానీ..ఆ క్రేన్ నామీదే పడి ఉంటే బాగుండేదనిపిస్తోంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఇటీవలే భారతీయుడు 2 సినిమా సెట్ లో క్రేన్ ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఈవీసీ స్టూడీయోలో లైటింగ్ కోసం సెట్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి చిత్ర బృందం ఉండే టెంట్ పై పడటం వల్ల శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ (34), సహాయకుడు చంద్రన్ మృతి చెందారు.