డిప్లొమా కోర్సులపై మళ్లీ పెరుగుతున్న ఆసక్తి

By రాణి  Published on  11 Feb 2020 5:10 AM GMT
డిప్లొమా కోర్సులపై మళ్లీ పెరుగుతున్న ఆసక్తి

  • మళ్లీ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు

మళ్లీ పాత రోజులు వచ్చేస్తున్నాయా? గుర్తుందా? ఒకప్పుడు పదో తరగతి చదవగానే పై చదువుల కన్నా డిప్లొమా కోర్సులవైపు పరుగులు తీసేవాళ్లు. 18-19 ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగాల్లో సెటిలైపోయేవాళ్లు. ఒక మూడు దశాబ్దాలుగా ఇంజనీరింగ్ హడావిడి వచ్చేసింది. డిప్లొమా కోర్సులు మూలన పడిపోయాయి.

కానీ మళ్లీ ట్రెండ్ మారుతోంది. ఈ విషయం ఉన్నతవిద్య విషయంలో ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో తెలంగాణలో డిప్లొమా కోర్సుల పట్ల మళ్లీ ఆసక్తి పెరుగుతోందని వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం 2014-15 లో తెలంగాఫలో 72123 మంది డిప్లొమా కోర్సుల్లో చేరగా, 2017-18 లో ఆ సంఖ్య పెరిగి 1.28 లక్షలకు చేరుకుంది. ఈ సర్వే గణాంకాల ప్రకారం 2015-16 లో 95203 మంది, 2016-17 లో 127662 మంది డిప్లొమా కోర్సుల్లో చేరారు. మన రాష్ట్రంలోని సాంకేతిక విద్య, శిక్షణ విషయాల రాష్ట్ర స్థాయి బోర్డు (టీఎస్ బెట్) 47 డిప్లొమా కోర్సులను నిర్వహిస్తోంది. టెక్స్ టైల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, గార్మెంట్స్, ఫుట్ వేర్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్ మెంట్, పెట్రోలియం టెక్నాలజీ, యానిమేషన్, కలినరీ ఆర్ట్స్, ఫుడ్ ప్రొడక్షన్, వివిధ ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తుంది. ఈకోర్సుల్లో అడ్మిషన్లు 65 శాతం పెరిగాయి.

సీ బీ ఎస్ ఈ, ఐ ఎస్ సీ, రాష్ట్ర స్థాయి కోర్సుల తరువాత డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇప్పటికీ కంప్యూటర్ కోర్సులు, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో విద్యార్థులల్లో ఆసక్తి ఉన్నా, క్రమేపీ డిప్లొమా కోర్సుల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని టీ ఎస్ బీ ఈ టీ కార్యదర్శి యూ బీ ఎన్ ఎన్ మూర్తి కూడా ధ్రువీకరిస్తున్నారు. డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేయడానికి చాలా కాలం పట్టడం వల్ల విద్యార్థులు డిప్లొమా కోర్సులను ఆశ్రయిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story