అర్జున అవార్డీ, పద్మశ్రీ సాధించిన బాక్సర్.. ఇప్పుడు అతడి పరిస్థితి చూస్తే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Feb 2020 3:52 PM GMTభారత దేశంలో క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పటి క్రికెటర్ అయినా ఇప్పటి క్రికెటర్ అయినా అతడికి ఏమైనా అయిందని తెలిస్తే చాలు.. మనోళ్లు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. క్రికెటర్స్ కు అందే ప్రోత్సాహకాలు ఇతర ఏ గేమ్ ఆడేవారికి కూడా దక్కదు. ఈ మధ్యనే అంతో ఇంతో టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ లాంటి ఆటలకు ఫాలోయింగ్ దక్కుతోంది. ఒకప్పుడు ఆటలో వెలుగు వెలిగి.. ఇప్పుడు తినడానికి ఏమీ లేని ఆటగాళ్లు ఎంతో మంది. దుర్భర స్థితిలో బ్రతుకుతూ.. ఎలాగోలా కాలం నెట్టుకుంటూ వచ్చే వారు చాలా మంది.. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
డింగ్కో సింగ్ అనే వ్యక్తి గురించి గూగుల్ చేయకుండా మీకేమైనా తెలుసా..? చాలా మందికి అతనెవరో తెలియదు. ఒకప్పుడు భారత బాక్సింగ్ లో అతనో 'గోల్డెన్ బాయ్'..! అతడి పంచ్ లకు ఎన్నో పతకాలు వచ్చాయి. ఈ 42 ఏళ్ల మణిపూర్ బాక్సర్ పరిస్థితి ఇప్పుడు చాలా దుర్భరంగా ఉంది. లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న డింగ్కో సింగ్ ఎవరైనా ఆదుకుంటారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. మూడేళ్ళ క్రితం లివర్ క్యాన్సర్ తో పోరాడి గెలిచాడు డింగ్కో సింగ్. ఇప్పుడు మరోసారి అతన్ని అదే క్యాన్సర్ కలవరబెడుతోంది. అర్జున అవార్డు, పద్మశ్రీ సొంతం చేసుకున్న డింగ్కో సింగ్ న్యూ ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్స్ ఆసుపత్రిలో ఉన్న మూడో ఫ్లోర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. జనవరి 28 నుండి అతడిపై డాక్టర్లు పరీక్షలు జరుపుతున్నారు. ఇంఫాల్ దగ్గరలో ఉన్న సెక్టా డింగ్కో సింగ్ సొంత ఊరు.. జాండీస్ కారణంగా మొదట ఆసుపత్రి పాలయ్యాడు. పిత్త వాహికలో బ్లాకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొన్ని అడ్వాన్స్ టెస్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వైద్యులు తెలిపారు.
జాండీస్ సోకగానే తాము న్యూ ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్స్ ఆసుపత్రికి వచ్చామని.. ఇప్పటికే చాలా టెస్టులు చేశారని.. ఆందోళకరంగా ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారని మంగళవారం నాడు మరొక బయోప్సీ, ఎండోప్సీ, ఆల్ట్రా సౌండ్ చేయనున్నారని డింగ్కో సింగ్ తెలిపాడు. చూస్తుంటే మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి అని అతను చెప్పుకొచ్చాడు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం డబ్బులు సర్దడం కాస్త కష్టంగా ఉందని.. ప్రస్తుతానికి స్నేహితులు, బంధువులు ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇంపాల్ నుండి ఢిల్లీకి వచ్చే సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) రీజనల్ డైరెక్టర్ వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇచ్చారని చెప్పాడు. అక్కడే ప్రస్తుతం డింగ్కో సింగ్ సీనియర్ కోచ్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులలో 25000 రూపాయలు ఫ్లైట్ టికెట్స్, ఆసుపత్రి అడ్మిషన్ ఫీజు కోసమే ఖర్చు అయ్యాయని అన్నాడు. జనవరి 28 నుండి ఇప్పటి వరకూ 1,50,000 రూపాయలకు పైగా ఖర్చు అయ్యిందని.. తన సేవింగ్స్ మొత్తం ఖర్చు అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆయన ఇచ్చిన బిల్లులలో కొన్నిటికి డబ్బులు ఎలాగూ ఇస్తుంది. కానీ కానీ అదో సుదీర్ఘమైన ప్రాసెస్.. డైరెక్ట్ గా తమ బ్యాంకు అకౌంట్ లింక్ చేసి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంటే బాగుండేదని.. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయ్యింటే బాగుండేదని ఆయన అంటున్నారు. తనకు ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో డబ్బులు అరేంజ్ చేయాలనే టెన్షన్ తగ్గుతుందని చెప్పుకొచ్చాడు. సింగ్ పరిస్థితి చూసిన అతని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. అథ్లెట్స్ కు సంబంధించిన హెల్త్ కేర్ పాలసీ సిస్టం మారాల్సిన సమయం వచ్చిందని డింగ్కో సింగ్ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం కింద అథ్లెట్స్ కు వైద్యానికి అయ్యిన ఖర్చు తిరిగి ఇస్తారు.. కానీ అవి ఎప్పుడు తిరిగి వస్తాయో తెలియని పరిస్థితి..!
డింగ్కో సింగ్ 1998 బ్యాంకాక్ ఆసియన్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు. 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆసియాడ్ లో భారత్ కు స్వర్ణం సాధించి పెట్టింది అతడే..! 2016 లో లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు డింగ్కో ఇంఫాల్ లో తనకు ఉన్న ఇంటిని అమ్మేశాడు. దాదాపు 70 శాతంకు పైగా అతని లివర్ ను తీసేశారు. అప్పట్లో డింగ్కో సింగ్ కుటుంబం 10 లక్షల దాకా ఖర్చు పెట్టింది.. అందులో కొంత మొత్తం మాత్రమే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేశాయి. 2017 ఫిబ్రవరిలో అప్పటి క్రీడల మంత్రి విజయ్ గోయల్ డింగ్కో సింగ్ కు పూర్తీ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ అందిన సహకారం శూన్యం.