సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా నేడే రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడొచ్చు..?

By సుభాష్  Published on  24 July 2020 9:34 AM GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా నేడే రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడొచ్చు..?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా 'దిల్ బేచారా'. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ లాక్ డౌన్ వలన సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు. దీంతో ఓటీటీలలో పలువురు సినిమాలను విడుదల చేస్తున్నారు. దిల్ బేచారా చిత్ర యూనిట్ కూడా సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావించింది. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడంతో ఈ సినిమాను ఓటీటీలో ఉచితంగా విడుదల చేయాలని భావించారు. సుశాంత్ అభిమానులు మాత్రం దిల్ బేచారాను థియేటర్ లో విడుదల చేయాలని కోరినప్పటికీ.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు తెరవడం చాలా ఆలస్యమే అయ్యేలా ఉంది.

దిల్ బేచారా చిత్రం జులై 24, 2020న విడుదల చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 7:30కి సినిమా ప్రీమియర్ అవ్వనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+ Hotstar) యాప్ లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అయితే డబ్బులు కట్టి లేదంటే ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కొత్త సినిమాలను చూడాల్సి ఉంటుంది. కానీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దిల్ బేచారా సినిమాను ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్ సైట్, యాప్ లో ఉచితంగా చూడొచ్చు. అమెరికా, యూకే, కెనెడాలో ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను చూడొచ్చని చిత్ర దర్శకుడు ముఖేష్ చాబ్రా సామాజిక మాధ్యమాల్లో తెలిపాడు.

'ఈ సినిమాను మన అందరి జీవితాల్లో ఎంతో స్పెషల్ గా మారనుంది. అందరూ కలిసి చూద్దాం.. ఒకే సమయంలో.. వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా చూద్దాం.. ఇది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం' అని ముఖేష్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజన సంఘీ నటించింది. స్వస్తిక ముఖర్జీ, సాహిల్ వైద్, మిలింద్ గుణాజీ, సైఫ్ అలీ ఖాన్ లు పలు పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్, పాటలకు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. ఈ చిత్ర ట్రైలర్ కు 10 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఈ రికార్డు అందుకున్న మొదటి సినిమా ట్రైలర్ గా నిలిచింది. సుశాంత్ అభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. సుశాంత్ కు ఘనమైన నివాళి ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు దిల్ బేచారాను చూడాలంటూ తమ అభిమానులను కోరుతూ ఉన్నారు.

సుశాంత్ సింగ్ మరణం ఎందరినో కలచివేసింది. బాలీవుడ్ లో నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నో పెద్ద ప్రాజెక్టుల నుండి సుశాంత్ ను కావాలనే తప్పించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Next Story