బాలుడిని చంపింది మందసాగరే : దీక్షిత్‌రెడ్డి హత్య కేసుపై ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం
By సుభాష్ Published on 22 Oct 2020 12:17 PM ISTమహబూబాబాద్‌లో బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. గత ఆదివారం కిడ్నాప్‌కు గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాపర్లు హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఈ ఘటకు సంబంధించి మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కిడ్నాపర్లు బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాతే డబ్బులు డిమాండ్ చేశారని, డబ్బు డిమాండ్ చేసి దొరికపోతామనే భయంతో బాలుడిని చంపేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలుడి కిడ్నాప్‌కు ముందు రెక్కీ నిర్వహించారు.
బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాప్ చేసిన రోజే సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్ శివారులోని గుట్టపైకి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన గంటన్నర తర్వాత బాలుడిని గొంతు నొక్కి చంపేశారని ఎస్పీ వివరించారు. బాలున్ని కిడ్నాప్ చేసింది.. చంపింది ఒక్కడే. బాలుడిని చంపింది నిందితుడు మందసాగరేనని అన్నారు. శనిగపురం గ్రామానికి చెందిన మందసాగర్ దీక్షిత్‌ను కిడ్నాప్ చేశాడు. మెకానిక్‌గా పని చేస్తున్న నిందితుడు తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నాము. దాదాపు 30 మంది అనుమానితులను ప్రశ్నించాం. కిడ్నాప్‌కు సూత్రధారి అయిన మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బాలుడి మృతదేహం మహబూబాబాద్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో లభించిందని అన్నారు. నిందితులకు తొందరలోనే శిక్ష పడేలా చూస్తామని ఆయన వివరించారు. మరిన్ని వివరాలు సాయంత్రం, లేదా రేపు ఉదయం వెల్లడిస్తామని చెప్పారు.