మథురలో నివాసం.. హైదరాబాద్ లో ఆన్ లైన్ దోపిడీ

By రాణి  Published on  16 Dec 2019 8:47 AM GMT
మథురలో నివాసం.. హైదరాబాద్ లో ఆన్ లైన్ దోపిడీ

ముఖ్యాంశాలు

  • డిజిటల్ దోపిడీ..!
  • సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
  • పెద్దమొత్తంలో ఆర్డర్లు...లక్షల రూపాయలు దోపిడీ

తాడిని దన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడన్నది పాత సామెత. సైబర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉంటే సైబర్ దోపిడీ అంత వెరైటీగా ఉంటుందన్నది నేటి సామెత. దుకాణదారుల దగ్గర్నుంచి పలు వస్తువులు కొన్నట్టుగా చేస్తూ, బ్రాండెడ్ ఉత్పాదనలను ఆన్ లైన్ కొనుగోలు చేస్తున్నట్టు చేస్తూ భారీగా ఆన్ లైన్ దోపిడీ చేస్తున్నారు కొందరు అతి తెలివి దొంగలు.

ఇలాంటి సైబర్ దొంగలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోని మథురకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఉండేది మథురలో... కానీ దొంగతనాలు చేసేది హైదరాబాద్ లో. గూగుల్ లో జస్ట్ డయల్ వంటి యాప్ లలో దొంగతనం చేయాల్సిన దుకాణాలను గుర్తించి, వాటిని ఎంపిక చేసుకుని, ఫోన్లు చేసి, తాము టోకున ఖరీదు చేయదలచుకున్నామని వీరు చెబుతారు. ఆన్ లైన్ లో బల్క్ ఆర్డర్లు వస్తాయన్న ఆశతో వ్యాపారులు వారి వలలో పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఆన్ లైన్ ఫ్రాడ్ లను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వీరు ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డబ్బులు పంపుతామని చెప్పి ఫోన్ నంబర్లను , యూపీఐ పేమెంట్ గేట్ వే వివరాలను సేకించి క్యు ఆర్ కోడ్ లను తయారు చేసి, షాప్ కీపర్లను ఈ కోడ్ ను స్కాన్ చేసి, యాప్ లో వచ్చిన పిన్ నంబర్ ను టైప్ చేయమని అడుగుతారు. దీంతో షాప్ కీపర్ ఖాతా నుంచి డబ్బులు సైబర్ దొంగల ఖాతాలోకి చేరిపోతాయి. తరువాత వారు పొరబాటున తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని చెప్పి, తాము పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపితే డబ్బును తిరిగి పంపించేస్తామని చెబుతారు. మళ్లీ వారు పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే లక్షల రూపాయలను తమ అకౌంట్ కి మార్చుకుని మాయమైపోతారని పోలీసులు తెలిపారు.

ఇటీవల హైదరాబాద్ లో ఒక వ్యాపారికి 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ ను సరఫరా చేయమని మథుర నుంచి అడిగారు. ఈ యాసిడ్ మొత్తం విలువ రూ. 21,000. వారు ఆయనకు క్యు ఆర్ కోడ్ పంపించారు. ఫోన్ పే ద్వారా డబ్బు పంపేందుకు ఆ క్యు ఆర్ కోడ్ ను స్కాన్ చేయమని కోరారు. వ్యాపారి అలా చేయగానే 56000 రూపాయలు ఆయన ఖాతాల నుంచి మాయమయ్యాయి. పోలీసులు ఇలాంటి ఫ్రాడ్ ల విషయంలో జాగ్రత్త గా ఉండమని వ్యాపారులను కోరారు.

Next Story