వందేళ్లయినా.. ఆడు 'మగాడ్రా' బుజ్జీ..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 6:46 AM GMT
వందేళ్లయినా.. ఆడు మగాడ్రా బుజ్జీ..!

ఆడకూతుళ్లంతా “ఆడు మగాడ్రా బుజ్జీ” అనుకుంటున్నారట . “వాడికి వందేళ్లు వచ్చినా పటుత్వం పోలేదు. ఆడది కనిపిస్తే వదలడం లేదు. నందమూరి బాలకృష్ణ భాషలో చెప్పాలంటే కన్నూ గీటుతున్నాడు. కడుపూ చేస్తున్నాడు. వేల మంది పిల్లల్ని పుట్టించి పాపులేషన్ ను పెంచేస్తున్నాడురా” అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరీ మగధీరుడు అనుకుంటున్నారా? ఆ మగధీరుడి పేరు డీగో. ఆ “మగధీరుడికి” నాలుగు కాళ్లు. వందేళ్లు. వీపు మీద ఒక పెద్ద కవచం. ఎందుకంటే అతగాడొక తాబేలు.

అవునండీ... డీగో అనే పేరున్న వందేళ్ల భీమకాయ తాబేలు రాత్రనక, పగలనక చెమటోడ్చి తన జాతి సంతతి అంతరించిపోకుండా శాయశక్తులా కృషి చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలోని గాలోపాగస్ ద్వీపంలో దాదాపు ఎనిమిది వందల తాబేళ్లకు తండ్రిగా నిలిచింది. ఈ జాతి తాబేళ్లు అంతరించిపోతుంటే అమెరికాలో సాన్ డీగో లోని జూ లో ఉంటున్న డీగోను రంగంలోకి దింపారు. ఇప్పుడు గాలోపాగస్ లోని 40 శాతం తాబేళ్లకి తల్లి ఎవరైనా తండ్రి మాత్రం డీగోయే. ఇప్పుడు ఎస్పనోలా అనే ద్వీపంలోనూ సంతతి పెంచే పని కోసం డీగోను పంపిస్తున్నారట. దాదాపు ఎనభై ఏళ్లుగా సాన్ డీగో జూ లో తన సొంత దేశమైన గాలోపాగస్ కి దూరంగా ఉన్నా, తన “దేశం” కోసం, “జాతి”కోసం దూరం నుంచే పాటుపడుతున్నాడట డీగో.

Diego tortoise

కెలోనాయిస్ హుడెన్సిస్ అనే ఈ జాతి తాబేళ్ల సంఖ్య ప్రపంచంలో కేవలం పదిహేనంటే పదిహేను మాత్రమే ఉండేదట. ఒక్క డీగో పుణ్యమా అని ఇప్పుడు వీటి జనాభా 2000 కి పెరిగిందట. ఈ పదిహేను తాబేళ్లలో మూడు మాత్రమే మగ తాబేళ్లు, పన్నెండు ఆడతాబేళ్లు. వీటికి కలిపి సాన్ డీగో జూలో బ్రీడింగ్ ప్రొగ్రామ్ ను నిర్వహించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆయన్ని గాలోపాగస్ ద్వీపంలో వదిలివేయాలని అధికారులు నిర్ణయించారట.

Diego tortoise

సో ... మన వందేళ్ల మగధీరుడు ఇప్పుడు తన సంతానం మధ్య శేష జీవితాన్ని గడిపేస్తాడన్న మాట. అయితే అధికారులు మాత్రం మనోడు వందేళ్లు వచ్చినా చాలా యాక్టివ్ అని, జనాభా వృద్ధికి ఇప్పటికీ తనకు చేతనైనంత చేస్తాడని హామీ ఇస్తున్నాడు. తమ “జాతి పిత” కు గాలో పాగస్ తాబేళ్లు ఎలా స్వాగతం చెబుతాయో మరి!!

Diego tortoise

Next Story