లాక్ డౌన్ పొడిగించకూడదంటే ప్రజలు సహకరించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి

By రాణి  Published on  20 April 2020 2:02 PM GMT
లాక్ డౌన్ పొడిగించకూడదంటే ప్రజలు సహకరించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి

ముఖ్యాంశాలు

  • త్వరలో నిబంధనలతో కూడిన కొత్తపాసులు
  • మూడు కిలోమీటర్లు దాటి వస్తే వాహనాలు సీజ్

తెలంగాణలో లాక్ డౌన్ గడువును సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమిషనరేట్ ల కమిషనర్ లతో పాటు ఐజీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొడిగించిన లాక్ డౌన్ లో కఠినంగా అమలు చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు. సోమవారం సాయంత్రం మీడియాతో సమావేశమైన డీజీపీ పలు కీలక నిర్ణయాలను తెలిపారు.

Also Read : లాఠీ దెబ్బలకు యువకుడు మృతి..ఎస్సై సస్పెండ్

రాష్ట్రంలో మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో రివ్యూ సమావేశం నిర్వహించామన్నారు. జనతా కర్ఫ్యూ అనంతరం లాక్ డౌన్ విధించినప్పటికీ రోజురోజుకూ రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటివచ్చిన వాహనాలను, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన లక్షా 21 వేల వాహనాలను సీజ్ చేశామన్నారు. అలాగే నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారికి, పలు ఐటీ సంస్థల్లో షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వర్తిస్తోన్నఉద్యోగులకు ఇచ్చిన పాస్ లను మళ్లీ రివ్యూ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం ఇచ్చిన పాస్ లను కొందరు మిస్ యూజ్ చేస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఇచ్చే పాస్ లలో పేర్కొన్న రూట్ లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, ఆ రూట్ కాకుండా వేరే రూట్ లో వెళ్తే మాత్రం పాస్ రద్దు చేస్తామన్నారు.

Also Read : వాళ్లను చూసి నేర్చుకోండి : ఏపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి సెటైర్లు

ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండటంతో..వారికి కలర్ కోడ్ కలిగిన పాస్ లను అందజేస్తామన్నారు. వాటిలో ఇన్ టైమ్ అవుట్ టైమ్ కూడా నమోదవుతుందని డీజీపీ పేర్కొన్నారు. అలాగే చాలా మంది ఆస్పత్రులకు వెళ్తున్నామని చెప్పి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారన్నారు. చిన్న చిన్నఆరోగ్య సమస్యలైతే దగ్గర్లో ఉన్న ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సిందిగా సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లాల్సిన వారు సంబంధిత డాక్టర్ వద్ద అంతకుముందు చూపించుకున్న ప్రూఫ్ లు వెంట తెచ్చుకోవాలన్నారు.

సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ పూర్తయ్యాక కోర్టు ద్వారా విడిపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. అలాగే మే 7వ తేదీ తర్వాత కరోనా వైరస్ తగ్గి లాక్ డౌన్ పొడిగించకుండా ఉండాలంటే ప్రజలు సహకరించాలని కోరారు. బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు.

Also Read : వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్..ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

పేదలకు, వలస కార్మికులకు, అన్నార్తులకు అన్నదానం చేసే వారు సామాజిక దూరం పాటించాలన్నారు. అలాగే నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్లకు ఎగబడితే రాబోయే కాలంలో వాటిని కూడా సీజ్ చేస్తామని డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా కంటైన్మెంట్ ఏరియాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేశామని, కేవలం నిత్యావసరాలను చేరవేసే వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 15వేల ఎసెన్షియల్ పాస్ లను జారీ చేసినట్లు తెలిపారు.

Next Story
Share it