ఏపీలో యథా సీఎం .. తథా మంత్రులు: దేవినేని ఉమా
By న్యూస్‌మీటర్ తెలుగు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో యథా సీఎం.. తథా మంత్రులు అన్నట్టు బాధ్యతరాహిత్యంగా ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నవంబర్ 1న చీఫ్ సెక్రెటరీకి వచ్చిన షోకాజ్ నోటీసులపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలన్నారు. సీఎం జగన్ అనుభవ రాహిత్యం వల్లనే ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు వచ్చాయని దేవినేని మండిపడ్డారు. ఏ దోపిడీ చేయబోతున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆరు నెలలయినా కాళ్లకు పారాణి ఆరలేదనటానికి సిగ్గుండాలని మాజీ మంత్రి దేవినేని ఫైర్ అయ్యారు.
కంచికచర్లలో ఇసుక లారీలు పట్టుబడ్డాయి. అనంతరపురం నుంచి బెంగళూరు ఇసుక తరలిపోతోందని మొత్తుకుంటే సీఎంకు కనపడటం లేదన్నారు. కంచికచర్ల మార్కెట్ యార్డ్‌లో పట్టుబడ్డ ఇసుక లారీలకు పర్మిట్లు పుట్టించి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారని దేవినేని ఆరోపణలు చేశారు. భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం జగన్‌కు కనిపించడం లేదా?. రోమ్ చక్రవర్తి రోమ్ తగలపడుతుంటే ఫిడేలు వాయించినట్టు, భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే సీఎం జగన్ వీడియో గేమ్ ఆడుకుంటున్నారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. 938 జీవోను మీడియాకు భయపడి వైఎస్సార్ పక్కనే పెడితే, ఆ జీవోకు నగిషీలు చెక్కి 2430 జీవోగా ఇచ్చి అప్రకటిత ఎమర్జెన్సీ క్రియేట్ చేశారు. పత్రికలకు కూడా కులాలు ఆపాదిస్తున్నారు. పాదయాత్రలో జగన్ అన్ని తిట్లు తిట్టి, ఇప్పుడు భవన కార్మికులను ఎందుకు ఓదార్చడం లేదన్నారు. నవంబర్ 1న సీఎం జగన్ ప్రసంగంలో తెలుగుపై క్లారిటీ ఇస్తే అర్థం చేసుకుంటామని మాజీమంత్రి దేవినేని వ్యంగ్యంగా మాట్లాడారు.