నిషేధం బేఖాతరు.. దేవరగట్టులో కొనసాగిన సమరం
By సుభాష్ Published on 27 Oct 2020 6:48 AM GMTబన్ని ఉత్సవాలను పోలీసులు నిషేధించినప్పటికీ భక్తులు మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా దేవరగట్టు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో బన్ని ఉత్సవాలను పోలీసులు నిషేధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈసారి ఉత్సవాలు జరుగుతాయా? లేదా? అన్న
ఉత్కంఠ నెలకొంది. పోలీసులు నిషేదం విధించి, కాపలా కాసినప్పటికి దేవరగట్టు కర్రల సమరం కొనసాగింది.
కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో యేటా బన్నీ ఉత్సవం సందర్భంగా మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు వివిధ గ్రామాల
ప్రజలు రెండుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు కర్రల సామును నిషేదించి..
ప్రజలు లోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 50 సిసి కెమెరాలు.. 30 చెక్ పోస్ట్ లు.. వేయికి పైగా పోలీసుల పటిష్ట
పహారా.. ఇవేవీ వారిని ఆపలేకపోయాయి. సంప్రదాయంగా జరుపుకునే వేడుకను నిలువరించలేకపోయాయి. దాదాపుగా పదిరోజులుగా పోలీసులు
చేసిన ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఏటా జరిగే ఉత్సవం.. ప్రజల నమ్మకం..జరిపి తీరాలనే సంకల్పం.. అంతే దేవరగట్టు కర్రల
సమరం విజయవంతంగా నిర్వహించుకున్నారు ప్రజలు.
సోమవారం రాత్రి 10:30 వరకూ తేరు బజారు ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. తరువాత ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది.
ఒక్కసారిగా జనంతో కిక్కిరిపోయింది. ఆలయంలో అర్చకులు స్వామి కల్యాణోత్సవం నిర్వహించగా అనంతరం ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి
కిందకి తీసుకువచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షసపడ వద్దకు తీసుకువెళ్లారు. కర్రల
సమరంలో 50 మంది గాయపడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.