లాఫింగ్ గ్యాస్ తో డిప్రెషన్ మాయం          

By Newsmeter.Network  Published on  14 Jan 2020 7:05 PM IST
లాఫింగ్ గ్యాస్ తో డిప్రెషన్ మాయం          

  • డిప్రెషన్ కి తేలికైన మందు కనిపెట్టిన వైద్యులు
  • లాఫింగ్ గ్యాస్ వల్ల డిఫ్రెషన్ లక్షణాలు దూరం
  • కేవలం రెండే రెండు గంటల్లో చక్కటి ఫలితాలు
  • కెటమైన్, నైట్రస్ ఆక్సైడ్ కలసి చేసిన అద్భుతం
  • మెదడుకు ఉత్తేజాన్ని కలిగించే గ్లూటమేట్ ఉత్పత్తి
  • తాజా పరిశోధనల్లో వెల్లడైన అద్భుతమైన నిజాలు

లాఫింగ్ గ్యాస్ డిప్రెషన్ లక్షణాలను కేవలం రెండు గంటల్లో దూరం చేస్తుందని తాజా పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. నేరుగా మెదడులో గ్లూటమేట్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపకరించే ఈ లాంఫింగ్ గ్యాస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లాఫింగ్ గ్యాస్ లో ఉండే నైట్రస్ ఆక్సైడ్ ఇంకా కెటమిన్ ల సంయోగంవల్ల ఈ ఫలితాలు కనిపిస్తాయంటున్నారు.

తీవ్రస్థాయి డిప్రెషన్ లో బాధపడే వారిపై ఈ ప్రయోగం చేసినప్పుడు ప్రతి నలుగురిలో ఒకరికి చాలా త్వరగా ప్రతి స్పందనలు కనిపించాయనీ, కేవలం రెండే రెండు గంటల్లో వారిలో స్పష్టమైన మార్పులు వచ్చాయనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని విధాలుగానూ పరిశీలించి రూఢి చేసుకున్న తర్వాతే ఫలితాలను ప్రకటించారు.

ఇరవైమంది డిప్రెషన్ పేషెంట్లను నమూనాగా తీసుకుని పైలట్ స్టడీ చేసినప్పుడు అంతకు ముందు అనేక రకాలైన యాంటీ డిప్రెసెంట్లకు ప్రతిస్పందించని ఆ రోగులు అత్యంత వేగంగా ఈ సరికొత్త థెరపీకి ప్రతిస్పందించడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా దాని ప్రభావం వారిపై చాలా రోజులవరకూ ఉండడంకూడా వాళ్లకు మరింత ఆశ్చర్యం కలిగించింది.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు నాలుగు వారాలపాటు 200 మంది పేషెంట్లపై నైట్రస్ ఆక్సైడ్ తో ఆక్సిజన్ ను కలిపి కనీసం వారిపై గంటసేపు ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మత్తు కలిగించే కెటమిన్ ను పార్టీ డ్రగ్ అని కూడా పిలుస్తారు. దీనితో కలిపి లాఫింగ్ గ్యాస్ ని ప్రయోగించినప్పుడు వెంటనే అద్భుతమైన ఫలితాలు కనిపించాయి.

సాధారణంగా డిప్రెషన్ ని తగ్గించడంకోస వాడే మందులు మెదడులో సంతోషంగా ఉండడానికి ఉపకరించే సెరోటోనిన్ లేదా డోపామైన్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేయడానికి ఉపకరిస్తాయి. కానీ లాఫింగ్ గ్యాస్, కెటమిన్ కలిస్తే గ్లూటమేట్ అనే మరో రసాయనాన్ని ఉత్తేజపరచి వెనువెంటనే డిప్రెషన్ కి మనిషి దూరమయ్యేట్టుగా సత్వర ఫలితాలను చూపించింది.

కానీ దీనివల్ల ఊహాజనితమైన లోకంలోనే ఎక్కువకాలం గడపడానికి రోగి ఇష్టపడే ప్రమాదం ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఈ కాంబినేషన్ కి ఉన్న లిమిటేషన్ అంటున్నారు. వీలైనంతవరకూ కెటమిన్ వినియోగంవల్ల ఎలాంట దుష్ఫలితాలూ ఉండకపోవచ్చంటున్నారు. అయితే కెటమిన్ కి రోగులు అడిక్ట్ అయ్యే ప్రమాదంకూడా ఉండొచ్చు.

అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించిన ఈ పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. సహజంగా అనస్తీషియన్లు సర్జరీ సమయంలో ఇచ్చే మత్తు మందుకు సరిసమానమైన మోతాదులోనే ఈ ప్రయోగాల కోసం లాఫింగ్ గ్యాస్ ని దానితో పాటుగా ఇతర కాంబినేషన్లను ఇస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుతం విశ్వవిద్యాలయ పరిశోధకులు తాము కనుగొన్న విషయాలపై అనేక విధాలైన పరీక్షలు జరుపుతున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉండడం విశేషం. వాషింగ్టన్ యూనివర్సిటీతోపాటుగా చికాగో యూనివర్సిటీలో ఇంకా మరికొన్ని ఎంపిక చేసిన సెంటర్లలో ఈ క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నారు.

రోగులు నేరుగా లాఫింగ్ గ్యాస్ ని కానీ, కెటమిన్ ని కానీ, ఆక్సిజన్ ని కానీ లేదా వీటి మిక్సర్ ని కానీ వారానికి ఒక గంటసేపు చొప్పున నాలుగు వారాలపాటు పీల్చుకుంటారు. అలా పీల్చుకున్న తర్వాత పూర్తిగా వాళ్లు పరిశోధకుల పర్యవేక్షణలోనే ఉంటారు. వీళ్లందరికీ నైట్రస్ ఆక్సైడ్ స్థాయిని మార్చిఇస్తూ ఫలితాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

Next Story