నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడినట్టే. ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు డెత్‌ వారంట్లు జారీచేయడంతో ఏడేండ్ల నిరీక్షణకు తెరపడిందని, ఈ నెల 22న ఉరితీయడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా ఉరి వాయిదా పడింది. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకొని నిందితులు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడకపోవడం, ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు స్పష్టం చేశారు. దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నిర్భయ నిందితుల డెత్ వారెంట్ వాయిదా వేయడంతో నిర్భయ తల్లి కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడికి వెళ్లినా… అందరూ దోషుల హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని.. తమకు మాత్రం హక్కులు ఉండవా అని ఆమె ప్రశ్నించారు.

అసలెందుకీ జాప్యం..

ట్రయల్‌ కోర్టు జారీ చేసిన డెత్‌ వారంట్‌ను సవాల్‌ చేస్తూ దోషి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలుచేశాడు. నిబంధనల ప్రకారం ఒక కేసులో ఒకరికన్నా ఎక్కువ మందికి ఉరిశిక్ష పడితే వారందరికీ ఒకేసారి శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి క్షమాభిక్ష, ఇతర న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు అధికారులు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే క్యురేటివ్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ముఖేశ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిని వాయిదా వేయాలని కోరాడు. నిబంధనల ప్రకారం ఈ నెల 22న దోషులను ఉరితీయాలి. కాబట్టి 21వ తేదీ మధ్యాహ్నంలోగా క్షమాభిక్ష పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్నా దోషులకు ఆ తర్వాత 14 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి సిఫారసు చేశారు. ఏది ఏమైనా ఈ పిటిషన్ క్లియర్ అయ్యేవరకు నిర్భయ దోషులకు ఉరి వాయిదా పడినట్టే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.