ఒక చీర.. ఇద్దరు హీరోయిన్లు

By Newsmeter.Network  Published on  13 Jan 2020 7:10 AM GMT
ఒక చీర.. ఇద్దరు హీరోయిన్లు

పార్టీల్లో అందరి కళ్లూ తన మీదే ఉండాలని ఒకమ్మాయి మాంఛి పసందైన డిజైనర్ సారీ కట్టుకొచ్చిందనుకొండి.. తన సారీ వంటి సారీ ఇంకెవరికీ ఉండకూడదని ఆ అమ్మాయి అనుకుందనుకొండి. తీరా పార్టీకి వచ్చి చూస్తే సరిగ్గా అలాంటి సారీయే కట్టుకున్న మరో అందగత్తె తారసపడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు దీపికా పాదుకోన్, కాజోల్ ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇద్దరి చీరా ఒకే రంగు. ఒకే డిజైన్, కొంగూ, హంగూ ఒకటే రకం, దీంతో ఇప్పుడు అందరినీ సర్ ప్రైజ్ చేయాలనుకున్న ఇద్దరికీ నిరాశ ఎదురైంది.

సమస్యేమిటంటే ఇద్దరూ వేర్వేరు డిజైనర్ల నుంచి చీర తయారు చేయించుకున్నారు. దీపికా సుప్రసిద్ధ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించారు. మనీశ్ మల్హోత్రా రూపొందించిన చీరను కాజోల్ కట్టుకున్నారు. ఇద్దరు డిజైనర్లూ దాదాపు ఒకే రకం చీరను నేయించారు. మనీశ్ మల్హోత్రా వాస్తవానికి ఇలాంటి చీరలను ముందే విడుదల చేశారు. ఇక దీపిక డిజైనర్ సవ్యసాచి ఇలాంటి చీర డిజైన్లను రూపొందించడం ఇదే మొదటిసారి. రెండు చీరలూ మెషీన్ పై తయారు చేసినవే.

ఇండియన్ ఫ్యాషన్ రంగంలో విదేశీ డిజైనర్ల మాడల్స్ ను కాపీ కొట్టడం మామూలే. మక్కీకి మక్కీ నకలు దించేసిన సంఘటనలు ఎన్నెన్నో. క్రియేటివ్ ఇన్ స్పిరేషన్ వంటి అందమైన పేర్లతో విదేశీ డిజైన్ల జీరాక్స్ కాపీలు బజార్లోకి వదిలేయడం సహజమే.అయితే ఒకే మాడల్ ను ఇద్దరూ ఒకే సమయంలో జారీ చేసిన ఘటనలు మాత్రం అరుదే. భారత ఫ్యాషన్ రంగంలో సినీ సెలబ్రటీలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. స్టార్లు తమ దుస్తులను ధరిస్తే తమ పంట పండుతుందని డిజైనర్లు భావిస్తారు. అందుకే సినీ తారల వెంట పడుతూంటారు.

ఇక్కడ ఇంకో తమాషా కూడా ఉంది. దీపిక నటించిన ఛపాక్, కాజల్ హీరోయిన్ గా నటించిన తానాజీ మాలుసురే చిత్రాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. వెండి తెరలపై పోటీపడుతున్న ఈ రెండు చిత్రాల హీరోయిన్లు ఒకే మోడల్ చీరను ధరించి ఫ్యాషన్ రంగంలోనూ పోటీ పడుతున్నారు.

Next Story
Share it