ఉరి శిక్ష విధించడం 'పాక్‌' చరిత్రలోనే ఇది రెండోసారి

By సుభాష్  Published on  17 Dec 2019 8:55 AM GMT
ఉరి శిక్ష విధించడం పాక్‌ చరిత్రలోనే ఇది రెండోసారి

  • దేశ ద్రోహం కింద కోర్టు సంచలన తీర్పు
  • నాలుగేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న ముషారఫ్‌

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కేసు విషయంలో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. దేశ ద్రోహం కేసులో లాహోర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులపై విచారణ జరిపిన పెషావర్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దోషిగా తేల్చింది. ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్ మరణ శిక్షను సమర్థించగా.. మరొక న్యాయమూర్తి వ్యతిరేకించారు. మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయంతో మరణ శిక్ష ఖరారైంది.

న్యాయమూర్తులకు గృహ నిర్భంధం:

ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2007లో నవంబర్‌ 3న రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్భంధం విధించి, అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. ఇంతటితో ఆగని ముషారఫ్ మీడియాపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

నాలుగేళ్లుగా దుబాయ్‌లో ...

తర్వాత 2013లో ముషారఫ్‌పై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. అలాగే 2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి నాలుగు సంవత్సరాలుగా అక్కడే తలదాచుకుంటున్నాడు. దీంతో కోర్టు ఆయనకు సమన్లు పంపినా ఏ మాత్రం స్పందించకుండా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఎఫ్‌ఐకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. గతంలో పాకిస్తాన్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి. మరో వైపు లాహోర్‌ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆయన తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story