మృతదేహాన్ని చూసి పరుగో పరుగు.. కరోనా వైరస్‌ ఎఫెక్ట్..

By Newsmeter.Network  Published on  31 Jan 2020 1:55 PM GMT
మృతదేహాన్ని చూసి పరుగో పరుగు.. కరోనా వైరస్‌ ఎఫెక్ట్..

కరోనా వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ కారణంగా చాలా మంది మరణించారు. కరోనా వైరస్‌ అంటే ప్రజలు ఎంతలా భయపడుతున్నారో చెప్పడానికి నిదర్శనమే ఈ చిత్రం. ఎప్పుడూ రద్దీగా ఉండే వుహాన్‌ వీధులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు భయటికి రావడం లేదు. వుహాన్‌ పట్టణంలోని నిర్మానుష్మ వీధిలో ఓ షాపు ముందు ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే ఆ మృతదేహాం దగ్గరికి వెళ్లడానికి ఎవరికి ధైర్యం సరిపోవడం లేదు. గంటల తరబడి మృతదేహాం రోడ్డుపైనే ఉన్నా.. కనీసం మరణించిన వ్యక్తి ఎవరై ఉంటారా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా ఎవరూ సాహించలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు వచ్చి మృతదేహాన్ని సర్జికల్ బ్యాగులో చుట్టి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తరలించారు. అనంతరం ఆ వ్యక్తి పడి ఉన్న ప్రదేశాన్ని రసాయనాలతో శుభ్రం చేశారు. కరోనా వైరస్ తోనే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని తాము భావించామని అందుకనే మృతదేహాం దగ్గరికి కూడా వెళ్లే సాహాసం కూడా చేయలేదని స్థానికులు తెలిపారు. ఒక వేళ మృతదేహాం దగ్గరికి వెళితే తమకు అది సోకుతుందని భావించామన్నారు. అయితే అతడు ఎలా చనిపోయాడన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఫోరెన్సిక్‌ నిపుణులు మృతదేహాన్ని పరీక్షిస్తున్నారు.

కరోనా వైరస్‌ మొదటగా పుట్టుకొచ్చింది వుహాన్‌ నగరంలోనే. కరోనా ధాటికి ఇప్పటి వరకు చైనా వ్యాప్తంగా 213 మరణించగా.. ఒక్క వుహాన్‌ నగరంలోనే 159 మంది మరణించారు. కరోనా ప్రభావంతో వుహాన్‌ నగరాన్ని నిర్బంధించారు. ఇక్కడి ప్రజలు బయటకు నగరం దాటి బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి ఆస్పత్రుల వద్ద వేచి చూస్తున్నామని తెలిపారు.

ఇక తాజా ఘటన గురించి ఓ మహిళ మాట్లాడుతూ.. ‘నాకు చాలా భయం వేసింది. ఇప్పటికే వుహాన్‌లో చాలా మంది చనిపోయారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు’ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కేసులతో వుహాన్‌ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు నిండిపోయాయి. ఒక్కో చోట రోగులు డాక్టర్‌ను కలిసేందుకు రెండు రోజుల సమయం పడుతోందట. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి విధించింది.

Next Story