అమృత తండ్రి మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

By Newsmeter.Network  Published on  1 March 2020 6:07 AM GMT
అమృత తండ్రి మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసు నిందితుడు మారుతీరావుకు చెందిన షెడ్‌లో శనివారం గుర్తుతెలియని మృతదేహాం లభించింది. దీంతో.. ఆ మృతదేహాం ఎవరిది..?ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది..? మరో హత్య జరిగిందా..? అని మిర్యాలగూడ వాసులు చర్చించుకుంటున్నారు.

మిర్యాలగూడలోని హనుమాన్‌పేటలో నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట రిలయన్స్‌పెట్రోల్ బంక్‌ ఎదురుగా ఉన్న పాడుబడ్డ షెడ్డులో తలుపుకు తాళం లేని ఓ పాత గది ఉంది. ఆ గదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గది నుంచి దుర్వాసన వస్తోందంటూ స్థానికులు శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. మిర్యాలగూడ టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డి తన బృందంతో అక్కడికి వచ్చి పరిశీలించారు.

దీంతో ఆ షెడ్డులో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం హత్య చేసినట్లు ఉండగా.. మృతదేహాం పై ఆయిల్ పోసి ఉంది. మృతుడి ఒంటిపై కళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఎక్కడైనా హత్యచేసి మృతదేహాన్ని తీసుకొచ్చి షెడ్డులో పడేశారా..? రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఎవరూ గుర్తించకుండా స్థానికంగా వదిలేశారా..? ముందస్తు పథకం ప్రకారం ఇక్కడికి తీసుకొచ్చి హత్యచేసి ఉంటారా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు నీలి రంగు చొక్కా, జీన్స్‌ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చేతికి వాచీ ఉంది. క్లూస్‌టీం సభ్యులు ఘటనా స్థలంలో ఆధారాలను, మృతదేహాం నుంచి వేలిముద్రలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చారు.

నార్కట్‌పల్లి - అద్దంకి రహదారి వెంట మారుతీ రావుకు కొంత స్థలం ఉంది. ఈ స్థలంలో గతంలో హోటల్‌ నిర్వహించగా.. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల సమయంలో విపరీతంగా దుమ్ము, ధూళీ వస్తుండటంతో దాన్ని మూసివేశారు. నాటి నుంచి అది ఖాళీగానే ఉందని స్థానికులు తెలిపారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

గర్భిణి అయిన భార్యను రెగ్యులర్ చెకప్‌కు తీసుకెళ్లి తిరిగొస్తున్న ప్రణయ్‌ను ఆస్పత్రి ఆవరణలో దుండగుడు కత్తితో నరికి చంపాడు. కుమారై వేరే కులానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుని తన పరువు తీసిందనే కోపంతో మారుతీరావు ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారాణలో తేలింది.

Next Story
Share it