కరోనాతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మృతి..!
By సుభాష్ Published on 6 Jun 2020 4:27 PM ISTకరోనాతో వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 1994 నుంచి పాక్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రమంలో ఉంటున్న దావూద్ ఇబ్రహీం, అతని భార్య మెహజబీన్ లకు కరోనా సోకి కరాచీ మిలటరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఆయన మృతి చెందాడని పాకిస్థాన్‌కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురితం చేసింది. వైరస్ సోకడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్ ఇబ్రహీం మృతి చెందాడని తెలిపింది.
అయితే ఆయన మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కాగా, భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా, 1993 వందలాది మంది ప్రాణాలు బలిగొన్న బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయట ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.