అతను ఉగ్రవాదే..!
By Newsmeter.Network
ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడ్డ శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ డీఎస్పీ దవీందర్ సింగ్.. రక్షకభట ముసుగులో ఉన్న ఓ ఉగ్రవాది అని పోలీసులు నిర్ధారించారు. ఉగ్రవాదులతో సమానంగా పరిగణిస్తూ విచారణ జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఉగ్రవాదులు ఇచ్చే డబ్బుకు ఆశపడే అతడు వారికి సహాయం చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు లో ముందుకు వెళుతున్నకొద్దీ ఆందోళకరమైన విషయాలు బయటపడుతున్నాయి.
2001 డిసెంబరు 13 భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. ఐదుగురు తీవ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీశారు. అఫ్జల్ గురు మరణశిక్షతో పార్లమెంట్ దాడి కేసు ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే కేసు విచారణ సమయంలో అఫ్జల్ ప్రత్యేకంగా చెప్పిన ఓ వ్యక్తిపై మాత్రం ఎలాంటి విచారణ జరగకపోవడం గమనార్హం. అతడే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత శనివారం అరెస్టయిన దవీందర్ సింగ్.
అసలు ఎవరీ దవీందర్
ప్రస్తుతం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న దవీందర్ ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే స్వచ్ఛందంగా జమ్ముకశ్మీర్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ విభాగానికి ( ప్రస్తుతం ఎస్ఓజీ-స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్)కేవలం ఆరేళ్ల కాలంలో హెడ్‌గా ఎదిగారు.
అయితే దవీందర్‌పై అప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్‌లో పౌరులను హింసిస్తున్నారని 2001లో విమర్శలు రావడం తో బదిలీతో సరిపెట్టారు. ఎస్ఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్ కశ్మీర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత దవీందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్ డెత్ లు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దవీందర్ విచారణ పద్ధతి చాలా కఠినంగా ఉండేదని గతంలో అరుంధతీ రాయ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. పార్లమెంట్ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఓ కేసులో దవీందర్ అఫ్జల్ గురును అరెస్టు చేశారు. ఆ సమయంలో నిర్బంధ గృహానికి తీసుకొచ్చిన అఫ్జల్‌ను తీవ్రంగా హింసించినట్లు దవీందరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.
ఆ తర్వాత 2004లో దవీందర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్ దాడికి సంబంధించిన కేసు విచారణ సమయంలో అఫ్జల్ గురు.. దవీందర్ పేరును ఓ లేఖలో ప్రస్తావించాడు. అందులో దవీందర్ ప్రస్తావన తెస్తూ.. అతడు చెబితేనే తాను ఉగ్రవాదులు పార్లమెంట్ దాకా రావడానికి కారును సమకూర్చానని పేర్కొన్నాడు.
ద్రవిందర్ అంటే భయంతోనే తానివన్ని చేశానన్నాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. అంతేకాదు స్థానికుల పట్ల కూడా దవీందర్ చాలా దురుసుగా ఉండేవారని సమాచారం. ఉగ్రవాదులని తప్పుడు కేసులు పెడతానని బెదిరించి స్థానిక వ్యాపారులు, ట్రక్ డ్రైవర్ల నుంచి డబ్బులు దోచుకునేవారని 2015లో ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా వారికి సాయం చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్ పోలీసులు దవీందర్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ ముస్తాక్ ఫోన్ సంభాషణ నిఘా సంస్థల దృష్టికొచ్చింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు చెక్ పోస్ట్ వద్ద పహారా కాసి దవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోతామని తన దగ్గరకు వచ్చారనీ, వారిని హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్తున్నాననీ బుకాయించాడు. అయితే ఉగ్రవాదులను విచారించగా.. తామేమీ లొంగిపోవడం లేదని, తమను జమ్మూ దాటిస్తే రూ. 12 లక్షలు ఇస్తామని ఒప్పుకొన్నట్లు తెలిపారు. వీరికి శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఆశ్రయమిచ్చిన దవీందర్.. డీఎస్పీ కారును తనిఖీ చేయరని నమ్మకంతో తన కారులో వారిని తీసుకుని బయల్దేరారు. అయితే అలాంటి అధికారాలేవీ దవీందర్‌కు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.