టీ20లకు వార్నర్ గుడ్ బై..?
By Newsmeter.Network
బాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం రీఎంట్రీలో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ ఆస్ట్రేలియా క్రికెటర్ కోసం పోలింగ్ నిర్వహించగా స్టీవ్ స్మిత్ కన్నా వార్నర్ ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకొని అలెన్ బోర్డర్ మెడల్‌ను మూడోసారి దక్కించుకున్నాడు. గతంలో 2016, 2017లోనూ వార్నర్ ఈ పతకాన్ని అందుకున్నాడు. పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా వార్నర్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే త్వరలోనే పొట్టి ఫ్మారాట్‌కు వార్నర్ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట.
2020, 21 టీ20 ప్రపంచకప్‌ల తరువాత టీ20లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లు వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్‌తో అన్ని ఫార్మాట్లో ఆడుతుండడం కష్టంగా ఉందన్నాడు. 'నా వరకు ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలను పెట్టుకొని తరచూ ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే కాస్త ఉపశమనం కలుగుతుంది. అది బహుశా అంతర్జాతీయ టీ20లు కావచ్చు’ అని అన్నాడు.
బీబీఎల్ జరిగే సమయంలో విశ్రాంతి తీసుకుని తదుపరి సిరీస్‌లకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావాలనే ఉద్దేశంతోనే బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు ఆసీస్ తరఫున 76 టీ20లు ఆడిన వార్నర్ 2,079 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 15 అర్ధశతకాలు ఉన్నాయి.