వైఎస్ఆర్‌ సీపీకి  దగ్గుబాటి గుడ్‌ బై ..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:22 AM GMT
వైఎస్ఆర్‌ సీపీకి  దగ్గుబాటి గుడ్‌ బై ..?!

ఒంగోలు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే... బీజేపీలోని ఉన్న పురంధేశ్వరి కూడా పార్టీలోకి రావాలని సీఎం జగన్ దగ్గుబాటి కుటుంబానికి షరతు విధించినట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దగ్గుబాటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్లోనే తన నిర్ణయాన్ని చెప్పినట్టు సమాచారం.

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రత్యేకంగా ప్రకటించేందుకు కూడా దగ్గుబాటి ఇష్టపడం లేదని తెలుస్తోంది. ఇకపై ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన రఘునాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకోవడం దగ్గుబాటి అంసతృప్తికి కారణమంటున్నారు సన్నిహితులు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టు సమాచారం.

క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి

‘ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసీపీలో చేరడానికి ముందు నా భర్త (దగ్గుబాటి వెంకటేశ్వర రావు).. నేను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారు. అందుకు వైసీపీ నేతలు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు ఆ పార్టీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

Next Story