నేడు తీరం దాటనున్న 'అంఫన్‌' తుఫాను

By సుభాష్  Published on  20 May 2020 1:49 AM GMT
నేడు తీరం దాటనున్న అంఫన్‌ తుఫాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్‌ తుఫాను గుండెల్లో గుబులు రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ తుఫాను ఒడిశా.. పారాదీప్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉందని, అలాగే బెంగాల్‌ దీఘాకు దాదాపు 200కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. అంతేకాదు అత్యంత వేగంగా తూర్పు తీరం వైపు దూసుకెళ్తోంది. అందువల్లనే ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షలకు పైగా మందిని తీర ప్రాంత జిల్లాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అన్ని రకాల సాయం అందిస్తాం..

కేంద్ర సర్కార్‌ నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. ప్రజలను తరలించే కార్యక్రమంలో నిమగ్నం కావాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.

కాగా, అంఫన్‌ తుఫాను అత్యంత తీవ్ర తుఫాను నుంచి కాస్త బలహీన పడి తీవ్ర తుఫానుగా మారింది. బుధవారం పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే బంగ్లాదేశ్‌ లోని హతియా దీవులు మధ్య తీరం దాటేలా ఉందని పేర్కొంటున్నారు.

అప్రమత్తమైన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం

తుఫాను కారణంగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైనంది. మంగళవారం రాత్రికి రాత్రి హతియా దీవుల్లో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్‌ వైపు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. అలాగే ఈదురుగాలులు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

మూడు రోజుల పాటు తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉంది. అలలు 4 నుంచి 5 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మత్స్య కారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రం వైపు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story
Share it