పనిచెయ్యని సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్..!

By Newsmeter.Network  Published on  8 Dec 2019 10:44 AM GMT
పనిచెయ్యని సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్..!

ముఖ్యాంశాలు

. బాధితులు, ఆపదలో ఉన్నవాళ్లు ఫోన్ చేయాలని పోలీసుల సూచన

. షీ టీమ్స్ కి ప్రత్యేకమైన నెంబర్ లేదు

హైదరాబాద్ : దిశ హత్యోదంతం తర్వాత సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్(9490617444) డీ యాక్టివేట్ అయిపోయింది. నవంబర్ 27న దిశపై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ కి వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సైబరబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ డీ యాక్టివేట్ అయ్యింది.

ఈ నెంబర్ కి వాట్సప్ మెసేజ్ లేవీ చేరడం లేదన్న విషయాన్ని సైబరాబాద్ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ పి.రవీంద్ర ప్రసాద్ ధృవీకరించారు. అసలు సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్ పనిచేస్తోందో లేదో చూడాలన్న ఆసక్తితో వేలాదిమంది ఈ నెంబర్ కి మెసేజ్ లు పంపించారని, వాట్సాప్ నిర్వాహకులకు విషయం అర్థంకాక వెంటనే ఆ నెంబర్ ని బ్లాక్ చేశారని ఆయన వివరించారు. మళ్లీ నెంబర్ ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వాట్సప్ నిర్వాహకులనుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదని ఆయన చెప్పారు.

వాట్సప్ నిర్వాహకులకు హైదరాబాద్ లో స్థానిక కార్యాలయం లేకపోవడంవల్ల కేవలం వారిని మెయిల్ ద్వారా మాత్రమే సంప్రదించే వీలు ఉందని, తాము అదే విధానంలో వాట్సప్ నిర్వహులకు సమాచారాన్ని అందించి నెంబర్ ని పునరుద్ధరించాల్సిందిగా అభ్యర్థించామనీ, త్వరలోనే వాట్సప్ నెంబర్ మళ్లీ పనిచేస్తుందన్న ఆశాభావంతో ఉన్నామనీ ఆయన తెలిపారు.

ప్రమాదంలో ఉన్నవారు, అత్యవసరంగా పోలీస్ సేవలు అవసరమైనవారు, ఇతర బాధితులు ఆ నెంబర్ కి నెట్వర్క్ కాల్స్ చేసి సమాచారం ఇవ్వొచ్చని, వాట్సప్ నెంబర్ పనిచేయనంతమాత్రాన నెట్వర్క్ నెంబర్ కు కాల్ చేసే సదుపాయంకూడా లేదని అనుకోవాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారం సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్ బిజినెస్ కేటగిరీకి చెందదు. వాట్సప్ నిర్వాహకులు బిజినెస్ నెంబర్లకు వచ్చే సమాచారాన్ని పూర్తి స్థాయిలో వీక్షించి, సబబు అనుకున్నతర్వాత నెంబర్ ని కొనసాగించే అవకాశం ఉంటుంది. సాంకేతికపరమైన ఇలాంటి కారణాలవల్ల సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్ బ్లాక్ అయ్యిందని ఐటీ సెల్ పోలీస్ అధికారి ప్రసాద్ తెలిపారు.

నిజానికి వ్యక్తిగతమైన, బిజినెస్ వాట్సప్ నెంబర్లకు ఉండే సదుపాయాలు దాదాపుగా పూర్తి స్థాయిలో ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల బిజినెస్ అకౌంట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా లేదని డిపార్ట్ మెంట్ భావించిందని ఆయన చెప్పారు.

మొత్తంగా సైబరాబాద్ ప్రాంతానికి అంతటికీ ఒకే నెంబర్ అందుబాటులో ఉండడంవల్ల వేలకొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయనీ, వాటిలో ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనదికాదో తెలుసుకోవడంకూడా కష్టంగా ఉందని, వేలకొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తడంవల్ల నెంబర్ పనిచేయకుండా పోయిందని మరో పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.

షీటీమ్స్‌కు కూడా ఒక నెంబర్‌ కేటాయిస్తే..

ఇదే నెంబర్ పూర్తి స్థాయిలో షీ టీమ్స్ కు కూడా అనుసంధానమై ఉండడంవల్ల ఇప్పుడు ఆ విభాగానికి కూడా కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమేనని షీటీమ్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. నిజానికి ఈ నెంబర్ కి ఎక్కువగా మహిళలనుంచి షీటీమ్స్ కి వచ్చే ఫిర్యాదుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందంటున్నారు. ప్రత్యేకంగా షీ టీమ్స్ కి డెడికేటెడ్ గా ఒక నెంబర్ ని కేటాయిస్తే మరింత సమర్థంగా సేవలు అందించే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు.

మరోపక్క షీ టీమ్స్ కోసం ప్రత్యేకంగా మరో నెంబర్ ని కేటాయించే ఆలోచన మొదట్లోనే జరిగిందనీ, కానీ అలా వేరు వేరు నెంబర్లు ఉండడంవల్ల గందరగోళం పెరగడం తప్ప ప్రత్యేకమైన ప్రయోజనం పెద్దగా కలిగే అవకాశం ఉండకపోవచ్చని మహిళా భద్రత విభాగం ఇన్ స్పెక్టర్ జనరల్ స్వాతి లక్రా అంటున్నారు.

ఇలాగే హైదరాబాద్ జ్యూరిస్ డిక్షన్ కి 9490616555 నెంబర్ అందుబాటులో ఉంది. బాధితులు నేరుగా ఫిర్యాదులను ఈ నెంబర్ కి పంపొచ్చని, నేరుగా ఈ నెంబర్ కి కాల్ కూడా చేసి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ నెంబర్ కూడా సాధారణమైన నెంబరే. భవిష్యత్తులో ఈ నెంబర్ కి కూడా సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నెంబర్ కి కలిగిన అసౌకర్యమే కలిగే ప్రమాదమూ లేకపోలేదని ఓ అంచనా.

Next Story
Share it